Telangana News: ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా ముందుకే సాగుతున్న వ్యాపారవేత్త గౌతమ్ అదానీ. తాజాగా ఆయన సంపద విషయంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీని అధిగమించారు.
గౌతమ్ అదానీ సంపద ఒక్క రోజులో 7.7 బిలియన్ డాలర్లు పెరగటంతో.. నికర విలువ 97.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో అదానీ ప్రస్తుతం భారతదేశపు అత్యంత సంపన్నుడిగా రికార్డుల్లో నిలిచారు. అయితే ఆసియా వ్యాప్తంగా అనేక రంగాల్లో వ్యాపారాను కలిగి ఉన్న అదానీ గ్రూప్ త్వరలోనే క్షిపణులు, డ్రోన్ల తయారీలోకి అడుగుపెడుతోంది. నివేదికల ప్రకారం గ్రూప్ ఈ ఫ్యాక్టరీని తెలంగాణలో ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

రెండు రోజుల ముందర తాజాగా అదానీ పోర్ట్స్ సీఈవో కరణ్ అదానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సమావేశంలో పెద్ద కుమారుడు కరణ్ అదానీతో పాటు అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సీఈవో ఆశిష్ రాజన్‌వంశీ కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో వారి మధ్య క్షిపణులు, డ్రోన్‌ల తయారీపై చర్చ జరిగిందని సమాచారం. రాష్ట్రంలో విండ్ ఎనర్జీ ప్రాజెక్టులను ప్రోత్సహించాలని వారు ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది.
వీటికి తోడు తెలంగాణలో ప్రస్తుతం ఉన్న డేటా సెంటర్ సామర్థ్యాన్ని 300 మెగావాట్ల మేర పెంచేందుకు అదానీ గ్రూప్ అంగీకరించింది. అదానీ గ్రూప్ తలపెట్టే ప్రాజెక్టులకు ప్రభుత్వ సహాయం ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. కొత్త పరిశ్రమలకు రాయితీలు సైతం అందుబాటులో ఉంటాయని తెలిపారు. గడచిన కొన్నేళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశీయంగా రక్షణ ఉత్పత్తులను పెంచటంపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఈ రంగంలోని కంపెనీలకు ప్రోత్సాహకాలు అందించటంతో పాటు అనేక మిలిటరీ అవసరాలకు ఆర్డర్లను దేశీయ కంపెనీలకు మోదీ సర్కార్ అందిస్తోంది. దీని ఫలితంగా ఇప్పుడు చాలా దేశాలు భారత్ నుంచి రక్షణ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications