Adani Loans: భారత కుబేరుడు గౌతమ్ అదానీ చెప్పారంటే చేస్తారంతే. అవును ఆయన ప్రకటించినట్లుగానే తన వ్యాపార కార్యకలాపాలను వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. తనపై నమ్మకం పెట్టుకున్న ఇన్వెస్టర్ల కోసం, వారిలో భయాలను తొలగించి నమ్మకాన్ని నింపేందుకు చర్యలు చేపట్టారు.
అదానీ గ్రూప్ గురువారం చెల్లించాల్సిన రూ.4,000 కోట్ల ($500 మిలియన్ డాలర్ల) బ్రిడ్జి లోన్‌ను తిరిగి చెల్లించింది. ఈ విషయంపై అవగాహన ఉన్న వ్యక్తులు వెల్లడించినదాని ప్రకారం అదానీ గ్రూప్ తన వ్యాపారాల ఆర్థిక ఆరోగ్యంపై విశ్వాసాన్ని తిరిగి పునరుద్దరించేందుకు కృషి చేస్తోంది. ఇటీవలి కాలంలో రుణాలను వేగంగా చెల్లించటం ద్వారా ఇన్వెస్టర్లకు భరోసాను కల్పిస్తోంది.

హిండెన్ బర్గ్ నివేదికను అనుసరించి కొన్ని బ్యాంకులు రుణాన్ని రీఫైనాన్స్ చేయడంలో వెనుకంజ వేసినట్లు బ్లూమ్‌బెర్గ్ వార్తా సంస్థ ఫిబ్రవరిలో నివేదించిన సంగతి తెలిసిందే. అయితే బిలియనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని సామ్రాజ్యం దాదాపు రూ.16,000 కోట్ల (2 బిలియన్ డాలర్ల) షేర్-బ్యాక్డ్ లోన్‌లను గడువు కంటే ముందుగా చెల్లించింది. దీనికి తోడు సకాలంలో బాండ్ రీపేమెంట్స్ కూడా చేసింది.
ఈ తరుణంలో GQG పార్టనర్స్‌కు చెందిన స్టార్ ఇన్వెస్టర్ రాజీవ్ జైన్ వివిధ అదానీ గ్రూప్ కంపెనీల్లో మెుత్తంగా రూ.15,000 కోట్ల (1.9 బిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు. ఈ పెట్టుబడితో మార్కెట్లో స్టాక్స్ కుదుటపడ్డాయి. ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని నింపటంలో గౌతమ్ అదానీ విజయవంతం అయినట్లు కనిపిస్తోంది. దీంతో కంపెనీల మార్కెట్ క్యాప్ సైతం తిరిగి పుంజుకుంటున్నాయి.
గ్లోబల్ బ్యాంకులు అదానీకి గత సంవత్సరం హోల్సిమ్ లిమిటెడ్ సిమెంట్ ఆస్తుల కొనుగోలు కోసం రూ.36,000 కోట్లు (4.5 బిలియన్ డాలర్లు) అప్పుగా ఇచ్చింది. ఇందులో కొంత భాగం మార్చి 9కి ఇవ్వాల్సి ఉంది. తదుపరి విడత రుణం 2024లో వస్తుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications