Ambuja Cements: దేశంలో అతిపెద్ద సిమెంట్ ఆటగాళ్లలో ఒకరి స్థాయికి ప్రస్తుతం గౌతమ్ అదానీ ఎదిగారు. దీనికోసం గడచిన కొన్ని సంవత్సరాలుగా అదానీ గ్రూప్ నిరంతరం పట్టును పెంచుకునేందుకు ఈ రంగంలోని అనేక కంపెనీలను వరుసగా కొనుగోలు చేస్తూ వస్తోంది. వాస్తవానికి బిర్లాలకు చెందిన అల్ట్రాటెక్ మెుదటి స్థానంలో ఉండగా రెండవ స్థానానికి చేరిన అదానీ గట్టి పోటీ ఇస్తోంది.
తాజాగా మంగళవారం అదానీ గ్రూప్ కి చెందిన అంబుజా సిమెంట్స్ కంపెనీ కీలక ప్రకటన చేసింది. పెన్నా సిమెంట్స్, సంఘీ ఇండస్ట్రీస్ కంపెనీలను అంబుజాలో మెర్జ్ చేయాలని గ్రూప్ నిర్ణయించినట్లు వెల్లడించింది. అయితే తాజా నిర్ణయంలో భాగంగా సంఘీ ఇండస్ట్రీస్ కంపెనీలో ప్రతి 100 షేర్లను హోల్డ్ చేస్తున్న ఇన్వెస్టర్లకు అంబుజా సిమెంట్స్ కంపెనీకి చెందిన 12 షేర్లను అలాట్ చేయనున్నట్లు ప్రకటించింది. సంఘీలో అంబుజాకు 58.08 శాతం వాటాలు ఉన్నాయి. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన పెన్నా సిమెంట్స్ కంపెనీ షేర్లను రికార్డు తేదీ నాటికి హోల్డ్ చేస్తున్న పెట్టుబడిదారులకు పూర్తిగా చెల్లించిన రూ.10 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు రూ.321.50 చెల్లించాలని నిర్ణయించింది. వాస్తవానికి పెన్నా సిమెంట్స్ కొనుగోలు ఆగస్టు 16, 2024న పూర్తయింది. ఈ క్రమంలో అంబుజా, పెన్నా, సంఘీ స్టాక్స్ ఇన్వెస్టర్లకు లాభాలను తెచ్చిపెట్టవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

వరుస కొనుగోళ్లతో అంబుజా సిమెంట్స్ ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మొత్తం సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 100 MTPAకి పెంచాలని అదానీ గ్రూప్ ప్లాన్ చేస్తోంది. అయితే తాజాగా జరుగుతున్న విలీనం కంపెనీని మరింత పోటీతత్వం, సమర్ధవంతంగా చేయడంతో పాటు వాటాదారుల విలువను పెంచడం లక్ష్యంగా జరుగుతోందని సిమెంట్ వ్యాపారం చూసుకుంటున్న అజయ్ కపూర్ వెల్లడించారు. అలాగే తాజా మెర్జర్ మెరుగైన వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్, అంతర్గత నిధుల మెరుగైన వినియోగం, ఏకీకృత నగదు ప్రవాహ నిర్వహణ, పాలనలో వేగవంతమైన విస్తరణ, వ్యయ పొదుపు కోసం వనరులను పూల్ వంటి అనేక ప్రయోజనాలను కలిగిస్తుందని కంపెనీ వెల్లడించింది.
భారతదేశంలో వేగంగా నిర్మాణ రంగం కొనసాగటంతో పాటు, ప్రభుత్వ వ్యయాలు పెరుగుతున్న వేళ అదానీ గ్రూప్ సెప్టెంబర్ 2022లో స్విస్ సంస్థ హోల్సిమ్ నుండి అంబుజా సిమెంట్‌లో మెజారిటీ వాటాల కొనుగోలుతో సిమెంట్ వ్యాపారంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ డీల్ విలువ దాదాపు రూ.50,000 కోట్లకు పైగానే జరిగింది. అయితే ఈ కంపెనీకి ఏసీసీ సిమెంట్స్ లో సైతం మెజారిటీ స్టేక్ ఉండటం గమనార్హం. అయితే సిమెంట్ వ్యాపారంలో వేగంగా ఎదగాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న అదానీ గ్రూప్ ఈ క్రమంలో సీకే బిర్లాల గ్రూప్ కు చెందిన ఒరియంట్ సిమెంట్ సంస్థను కూడా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే వూహాత్మక విస్తరణ ప్రణాళికల్లో భాగంగా కంపెనీ రానున్న కాలం కోసం మరిన్ని కొనుగోళ్లు చేపట్టే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే క్రమంలో 2028 ఆర్థిక సంవత్సరం నాటికి 140 మిలియన్ మెట్రిక్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి లక్ష్యంగా అదానీ గ్రూప్ ముందుకు సాగుతోందని తెలుస్తోంది. అయితే ఇదే క్రమంలో బిర్లాలకు చెందిన అల్ట్రాటెక్ సిమెంట్స్ మెుత్తం ఉత్పత్తి సామర్థ్యం 156.66 మిలియన్ మెట్రిక్ టన్నుల వార్షికంగా కలిగి ఉంది. అయితే 2028 నాటికి దీనిని 200 ఎంటీపీఏకి పెంచాలని బిర్లారు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications