Adani SBI: మరిన్ని షేర్లు తాకట్టు పెట్టిన అదానీ గ్రూప్.. ఆదాయ వృద్ధి టార్గెట్స్ సగానికి తగ్గింపు..!
Adani SBI: రోజురోజుకూ తన కంపెనీ షేర్ల విలువ తగ్గిపోవటం ఆదానీ గ్రూప్ కంపెనీలకు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో గ్రూప్ కు చెందిన మూడు కంపెనీల అదనంగా తాకట్టుపెట్టాలని నిర్ణయించింది.

స్టేట్ బ్యాంక్ లోన్..
షేర్లను తాకట్టు పెట్టి అదానీ గ్రూప్ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ వద్ద లోన్ పొందింది. అయితే ప్రస్తుతం మార్కెట్లో కంపెనీ షేర్ల పతనం కారణంగా.. అదానీ పోర్ట్స్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీల షేర్లను అదనంగా SBIకి తాకట్టు పెట్టాయి. హిండెన్ బెర్గ్ వివాదం కారణంగా దాదాపు 120 బిలియన్ డాలర్లు అదానీ గ్రూప్ కంపెనీలు నష్టపోయాయి. దీంతో తరిగిన విలువకు సమానమైన షేర్లను తనఖా పెట్టాల్సి వచ్చినట్లు తెలుస్తోంది.

SBI క్యాప్ ట్రస్టీకి..
అదానీ గ్రూప్ మూడు కంపెనీల షేర్లను SBI క్యాప్ ట్రస్టీ కంపెనీ (SBICAP ట్రస్టీ)కి తాకట్టు పెట్టింది. అదానీ గ్రూప్ ఇప్పటివరకు తన షేర్లలో ఒక శాతం SBICAPకి తాకట్టు పెట్టింది. దీని కింద 75 లక్షలకు పైగా APSEZ షేర్లు తనఖాలో ఉన్నాయి. అలాగే అదానీ గ్రీన్ కంపెనీకి చెందిన మొత్తం 1.06 శాతం షేర్లను 60 లక్షల అదనపు షేర్లతో తాకట్టు పెట్టింది. స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం అదానీ ట్రాన్స్‌మిషన్‌లోని మొత్తం 0.55 శాతం షేర్లతో పాటు 1.3 లక్షల అదనపు షేర్లు తాకట్టు పెట్టబడ్డాయి.

స్టేట్ బ్యాంక్ వివరణ..
ఆస్ట్రేలియాలోని అదానీ గ్రూప్ కార్మైకేల్ కోల్ మైనింగ్ ప్రాజెక్ట్ కోసం SBI అందించిన చెల్లింపులకు హామీగా SBI మరొక బ్యాంకుకు జారీ చేసిన 300 మిలియన్ డాలర్ల క్రెడిట్ లెటర్‌లో భాగంగా అదానీ గ్రూప్ అదనపు హామీగా నేడు మూడు కంపెనీల షేర్లను తాకట్టు పెట్టినట్లు ఎస్బీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. ఏదైనా మార్క్-టు-మార్కెట్ నష్టాల ఖాతాలో టాప్ అప్ చేయాల్సిన అవసరం ఉందో లేదో అంచనా వేయడానికి ప్రతి నెలాఖరులో కొలేటరల్ సమీక్షించబడుతుందని బ్యాంక్ వెల్లడించింది.

అదానీ గ్రూప్ తాజా నిర్ణయం..
షేర్ల పతనం కారణంగా ఏర్పడిన నష్టాల తర్వాత అదానీ గ్రూప్ తాజాగా తన ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని 40 శాతం నుంచి దాదాపు సగానికి తగ్గించుకుంది. ఇప్పటి వరకు అదానీ గ్రూప్ మార్కెట్ క్యాప్ సుమారు 117 బిలియన్ డాలర్ల మేర తగ్గటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఆదాయ లక్ష్యం 15-20 మధ్య ఉండవచ్చని కంపెనీ భావిస్తోంది. ఇటీవల గౌతమ్ అదానీ కంపెనీ షేర్లను తాకట్టు నుంచి విడిపించనున్నట్లు వెల్లడించారు. అయితే పరిస్థితులు పూర్తి వ్యతిరేకంగా ఉన్నందున.. నేడు ఎస్బీఐకి మరిన్ని షేర్లను కంపెనీ తాకట్టుగా ఇవ్వాల్సి వచ్చింది.


Click it and Unblock the Notifications