Adani News: రాకెట్ వేగంతో అదానీ షాపింగ్.. మరో సిమెంట్ కంపెనీపై కన్ను..
Star Cement: దాదాపు రెండేళ్లుగా అదానీ గ్రూప్ సిమెంట్ వ్యాపారంలో చాలా అగ్రసివే కొనుగోళ్లను చేపడుతోంది. అంబుజా, ఏసీసీ సిమెంట్స్ నుంచి ఇప్పటి వరకు దాదాపు అరడజనుకు పైగా కంపెనీల్లో కీలక వాటాలను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో అదానీ గ్రూప్ సిమెంట్ వ్యాపారంలో మెుదటి స్థానంలో ఉన్న బిర్లాలకు చెందిన అల్ట్రాటెక్ తో పోటీపడుతోంది. ఈ క్రమంలో అదానీ గ్రూప్ మరో కీలక కొనుగోలు కోసం సిమెంట్ రంగంలో చర్చలు కొనసాగిస్తోందని వార్త వెలుగులోకి వచ్చింది.
తాజాగా అదానీ గ్రూప్ సంస్థ అంబుజా సిమెంట్ ప్రస్తుతం స్టార్ సిమెంట్ కంపెనీలో కీలక వాటాల కొనుగోలు కోసం చర్చలు జరుపుతున్నట్లు వెల్లడైంది. అదానీ తన వ్యాపార విస్తరణ ప్రణాళికలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చర్చలు ఏ స్థాయిలో ఉన్నాయి, లావాదేవీ వివరాలు వంటి విషయాలు బయటకు రానప్పటికీ ఈ డీల్ మూల్యాంకనం కోసం కన్సల్టెన్సీ సంస్థ EYని నియమించినట్లు తెలిసింది. ఈ విషయంపై ఇప్పటి వరకు అదానీ గ్రూప్ కానీ, స్టార్ సిమెంట్ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దేశంలోని ఈశాన్య ప్రాంతంలో స్టార్ సిమెంట్ కంపెనీకి మెజారిటీ మార్కెట్ వాటా ఉన్నందున ఈ వ్యూహాత్మక కొనుగోలు జరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.

ఈశాన్య రాష్ట్రాల్లో సిమెంట్ వ్యాపారంలో కింగ్ గా కొనసాగుతున్న స్టార్ సిమెంట్ సంస్థకు ప్రస్తుతం 7.7 మెట్రిక్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఉన్నాయి. అయితే 2030 నాటికి కంపెనీ దీనిని దాదాపు 25 మెట్రిక్ టన్నుల వార్షిక ఉత్పత్తి స్థాయిలకు పెంచాలని చూస్తున్నట్లు సమాచారం. కంపెనీకి మేఘాలయలో కంపెనీకి ఉత్పత్తి ప్లాంట్ ఉంది. 2001లో స్థాపించబడిన కంపెనీ దేశంలోని పేరుగాంచిన సిమెంట్ కంపెనీల జాబితాలో స్థానాన్ని దక్కించుకుంది. ఇదే క్రమంలో కంపెనీ ఈశాన్య భారతంలో తన అగ్రస్థానాన్ని సుస్థిరంగా కొనసాగిస్తూనే పశ్చిమ బెంగాల్, బీహార్ వంటి మార్కెట్లలో వేగంగా విస్తరిస్తోంది.
ప్రస్తుతం కంపెనీ దేశంలోని దాదాపు 10 రాష్ట్రాల్లో ఉత్పత్తులను విక్రయిస్తుండగా 14,000కు పైగా డీలర్లు రిటైలర్ల నెట్ వర్క్ కలిగి ఉంది. ఇదే క్రమంలో కంపెనీ మెుత్తం ఉద్యోగుల సంఖ్య దాదాపు 4000కు పైగా ఉన్నట్లు అధికారికి వెబ్‍సైట్ లో అందించిన సమాచారం ప్రకారం తేలింది. ఇప్పటికే అంబుజా సిమెంట్స్, ఏసీసీ సిమెంట్స్, పెన్నా సిమెంట్స్, ఓరియెంట్ సిమెంట్స్, సంఘీ సిమెంట్స్ కంపెనీల్లో కీలక వాటాలను వూహాత్మకంగా ఇప్పటికే అదానీ దక్కించుకున్న సంగతి తెలిసిందే. మధ్యాహ్నం 1.10 గంటల సమయంలో అంబుజా సిమెంట్స్ కంపెనీ షేర్ ధర ఒక్కోటి రూ.563.80 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది.


Click it and Unblock the Notifications