Adani Future Plans: హిండెన్‌బెర్గ్ నివేదిక వల్ల తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న గౌతమ్ అదానీ.. ఏడాది తిరక్కుండానే పోగొట్టుకున్న దాన్ని తిరిగి దక్కించుకున్నారు. లక్షల కోట్ల సంపద ఆవిరైనా, సంవత్సర కాలంలో తన సామ్రాజ్యాన్ని అజేయంగా నిలిపారు. అంతేకాకుండా రుణభారాన్ని సైతం తగ్గించుకుంటూ, కొత్త ఇన్వెస్టర్లను సంపాదించుకున్నారు. దీంతో మరోసారి మకుటంలేని మహారాజుగా తన వ్యాపారాల్లో రాణిస్తున్నారు.
మరో 15 రోజుల్లో ప్రారంభం కానున్న కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అదానీ గ్రూప్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి. దాని ప్రకారం.. తన పోర్ట్‌ఫోలియో కంపెనీల్లో 1.2 లక్షల కోట్లు పెట్టుబడులుగా పెట్టాలని భావిస్తోంది. ముందుగా అంచనా వేసిన ఇన్వెస్ట్‌మెంట్స్‌తో పోలిస్తే ఇది 40 శాతం ఎక్కువ కావడం గమనార్హం. ఈ స్థాయి భారీ పెట్టబడుల వల్ల వ్యాపారం మూడింతల వేగంతో వృద్ధి చెందుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

ఇక 7 నుంచి 10 ఏళ్ల లోపు మొత్తం 100 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయాలని చూస్తోంది. ఇందులో సింహభాగం వేగవంతమైన వృద్ధికి ఆస్కారం ఉన్న గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక శక్తి వనరులు మరియు విమానాశ్రయాల వ్యాపారాల్లోకి వెళ్లనున్నట్లు విశ్లేషకుల అభిప్రాయం. ప్రణాళికాబద్ధమైన ఈ గ్రూప్ క్యాపిటల్‌లో 70 శాతాన్ని గ్రీన్ పోర్ట్‌ఫోలియోలో మరో 30 శాతాన్ని పోర్టులు, విమానాశ్రయాలు వంటి బిజినెస్ లోకి మళ్లించనుంది.
2023 క్యాలెండర్ సంవత్సరంలో అదానీ గ్రూప్ పోర్ట్‌ఫోలియ్ ఆల్ టైం హైయెస్ట్ 9.5 బిలియన్ డాలర్ల EBITDAని నమోదు చేసింది. అంటే 34.4 శాతం వృద్ధి సాధించింది. ఇక డిసెంబర్ త్రైమాసికంలో EBITDA రికార్డ్ స్థాయిలో 63.6 శాతం పెరిగింది. కాగా మార్చి నుంచి సెప్టెంబర్ మధ్య నికర రుణం 4 శాతం తగ్గింది. వేగంగా వృద్ధి చెందుతున్న లాభాల వల్ల నగదు ప్రవాహాలు పెరుగుతుండటంతో ఈ మెగా స్కేల్ పెట్టుబడుల ప్రణాళిక అనుకున్న విధంగా సాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications