Gautam Adani: ఏపీ ముఖ్యమంత్రిని కలిసిన గౌతమ్ అదానీ.. విజయవాడలో భేటీ ఎందుకంటే..
Gautam Adani: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అదానీ గ్రూప్ వ్యవస్థాపకులు, చైర్మన్ గౌతమ్ అదానీ గురువారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో కలిశారు.
ఏపీలో అదానీ గ్రూప్ వ్యాపార పెట్టుబడులకు సంబంధించిన విషయాలపై ప్రధానంగా చర్చ జరిగిందని వెల్లడైంది. రాష్ట్రంలోని అనంతపురం, కడప, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో 15,000 మెగావాట్ల సామర్థ్యం గల పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులపై ఈ భేటీలో చర్చించారు. దీనికి తోడు అమలు చేస్తున్న పలు ప్రాజెక్టులపై అదానీ ముఖ్యమంత్రితో చర్చించారని సీఎంవో వర్గాలు వెల్లడించాయి.

ఈ ఏడాది మార్చిలో ఏపీ ప్రభుత్వం పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా ఆర్థిక రాజధాని విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అదానీ కార్యక్రమానికి రాలేకపోవటంతో.. కుమారుడు కరణ్ అదానీని పంపారు. ఆ సమయంలో అదానీ గ్రూప్ ఏపీలో రెండు కొత్త సిమెంట్ యూనిట్లు, వైజాగ్ డేటా సెంటర్, గంగవరం పోర్ట్, రెన్యూవబుల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. అయితే అప్పుడు రాలేకపోయిన గౌతమ్ అదానీ తాజాగా సీఎంను నేరుగా కలిసి ప్రాజెక్టుల అమలు ప్రణాళికలపై చర్చించారని సమాచారం.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు అదానీ గుజరాత్ అహ్మదాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ భేటీకి సంబంధించి జరిగిన చర్చల సారాంశాన్ని జోడిస్తూ గౌతమ్ అదానీ అర్థరాత్రి 12 గంటల సమయంలో ఒక ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications