Adani: లక్షల కోట్ల పెట్టుబడితో అదానీ దూకుడు.. రెండేళ్లలో ట్రెండ్ సెట్ చేసేందుకు నయా ప్లాన్
Green Energy: ఈ ఏడాది ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న అదానీ గ్రూప్.. ఎట్టకేలకు తిరిగి నిలదొక్కుకోగలిగింది. అంతర్జాతీయ స్థాయిలో భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ, ముందుకు దూసుకువెళ్తోంది. తాజాగా తమ కంపెనీల భవిష్యత్ ప్రణాళికను గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అంబానీ వెల్లడించారు.
మల్టీ బిలియనీర్ గౌతమ్ అదానీ కంపెనీల ర్యాలీ స్టాక్ మార్కెట్‌లో కొనసాగుతోంది. దేశంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం వివిధ రంగాల్లో తమ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు గౌతమ్ అదానీ తెలిపారు. మొత్తం 7 లక్షల కోట్లమేర ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నట్లు చెప్పారు.

రాబోయే 10 ఏళ్లలో ఎనర్జీ సొల్యూషన్స్‌లో భారీగా పెట్టుబడి పెట్టేందుకు తమ ప్రణాళికను ఇటీవల ప్రకటించారు. ఈమేరకు స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వివరాలు వెల్లడించారు. పర్యావరణ హితంగా తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని చూస్తున్నట్లు చెప్పారు. 2025 నాటికి కార్బన్-న్యూట్రల్ పోర్ట్ కార్యకలాపాలను జాతీయ ప్రమాణంగా సెట్ చేస్తామని Xలో తెలిపారు.
'2040 నాటికి APSEZను నికర జీరోగా నిలపాలని భావిస్తున్నాం. పర్యావరణ అనుకూల పరివర్తనలో భాగంగా అన్ని క్రేన్లను విద్యుదీకరించడం, డీజిల్ ఆధారత వాహనాలను బ్యాటరీ బేస్డ్ ITVలుగా మార్చడం వంటి చర్యలు తీసుకోనున్నాం. ఇందుకు అదనంగా 1000 MW పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని ఇన్‌స్టాల్ చేయాలని చూస్తున్నాం' అని సోషల్ మీడియా పోస్ట్‌లో వెల్లడించారు.
గుజరాత్‌లోని కచ్ వద్ద తమ సంస్థ అభివృద్ధి చేస్తున్న ప్రపంచంలోని అతిపెద్ద గ్రీన్ ఎనర్జీ పార్క్‌కు సంబంధించిన ప్రణాళికలను కూడా ఆయన పంచుకున్నారు. ఎడారిలో 726 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్.. అంతరిక్షం నుంచి కూడా కనిపిస్తుందన్నారు. 20 మిలియన్ల గృహాలకు కరెంట్ సరఫరా చేసే విధంగా 30GW విద్యుత్ ఉత్పత్తి చేయనున్నట్లు చెప్పారు.


Click it and Unblock the Notifications