Adani Green Energy: దేశంలోని ఎనర్జీ రంగంలో కీలక మార్పులను పక్కాగా అందిపుచ్చుకుంటున్నారు అదానీ. గ్రీన్ ఎనర్జీ, థర్మల్ ఎనర్జీ ఉత్పత్తితో పాటు పవర్ ట్రాన్స్‌మిషన్ రంగంలోనూ ఆయన దూకుడు ప్రస్తుతం కొనసాగుతోంది.
గుజరాత్‌లోని ఖవ్రా ఆర్‌ఈ పార్క్‌లో 1,000 మెగావాట్ల సౌరశక్తి ఉత్పత్తిని ప్రారంభించినట్లు అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ నేడు తెలిపింది. ఈ వార్తతో అదానీ ఎనర్జీ కంపెనీ షేర్లు మార్కెట్ల పతనంలోనూ పెరుగుదలను నమోదు చేశాయి. బీఎస్ఈలో కంపెనీ షేర్లు 2 శాతం వృద్ధితో రూ.1,982 స్థాయికి చేరుకున్నాయి. దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్ వినియోగంతో పాటు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని అదానీ గ్రూప్ తన ఉత్పత్తి సామర్థ్యాలను చాలా కాలంగా పెంచుకుంటున్న సంగతి తెలిసిందే.

తాజా పరిణామం తర్వాత అదానీ గ్రీన్ ఎనర్జీకి దేశవ్యాప్తంగా మెుత్తం నిర్వహణ సామర్థ్యం 9,478 మెగావాట్లకు పెరిగినట్లు ప్రకటించింది. 2030 నాటికి 45,000 మెగావాట్ల సామర్థ్యం సాధించాలనే లక్ష్యంతో కంపెనీ ముందుకు సాగుతోంది. ఖవ్రాలో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత 12 నెలలలోపే 1,000 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని విజయవంతంగా అదానీ గ్రూప్ సృష్టించింది. ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన ప్లాంట్‌ను 538 చదరపు కిలోమీటర్లలో నిర్మిస్తున్నారు. ఇది పారిస్ కంటే 5 రెట్లు ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. దీని మొత్తం సామర్థ్యం 30 గిగావాట్లుగా ఉంది.
రానున్న 5 ఏళ్ల కాలంలో ప్రాజెక్టు పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు దాదాపు 15,000 మందికి పైగా ఉద్యోగాలను కల్పిస్తుందని కంపెనీ చెబుతోంది. భారత గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలతో పాటు పెరుగుతున్న తలసరి విద్యుత్ వినియోగాన్ని కాసులు చేసుకునేందుకు దేశంలో ఇప్పటికే అనేక కంపెనీలు సోలార్ రంగంలో పనిచేస్తున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్న తీరు ఈ రంగంలో అపరిమిత అవకాశాలను పెంచింది. సబ్సిడీ కింద కోటి ఇళ్లకు సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసే పథకాన్ని మోదీ సర్కార్ దేశంలో ఇటీవల ప్రారంభించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications