Adani News: బంగ్లాదేశ్ మెడపై అదానీ కత్తి.. టైమ్ బాంబ్ టిక్ టిక్..!!
Adani Power: దేశీయ బిలియనీర్ గౌతమ్ అదానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని భారత్ దాటి బయటకు విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పొరుగున ఉన్న దేశాల్లో పోర్టుల నుంచి పవర్ వరకు వివిధ వ్యాపార అవకాశాలను ఇప్పటికే అందిపుచ్చుకున్నారు. అయితే పెట్టుబడి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ తర్వాతి పరిస్థితులు మాత్రం అంత సాఫీ ప్రయాణాన్ని సూచించటం లేదు.
ఈ క్రమంలోనే పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌కు అదానీ పవర్ అనుబంధ సంస్థ అదానీ పవర్ జార్ఖండ్ లిమిటెడ్ గట్టి హెచ్చరిక చేసింది. పవర్ బిల్లు బకాయి భారీగా పెరిగిపోవటంతో సరఫరాను దాదాపు సగానికిపైగా ఇప్పటికే తగ్గించేసింది. దీనికి తోడు బంగ్లా ప్రభుత్వం నుంచి 850 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీ ప్రకారం రూ.7,200 కోట్లు పెండింగ్ ఉంది. ఈ క్రమంలో నవంబర్ 7లోగా పెండింగ్ బిల్ చెల్లించకపోతే విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని హెచ్చరించింది. భారతదేశంలోని థర్మల్ ప్లాంట్ నుంచి అదానీ గురువారం రాత్రి నుంచి పవర్ ఉత్పత్తిని భారీగా తగ్గించటంతో ఆ ప్రభావం బంగ్లాదేశ్ చూసింది. ఈ క్రమంలో 1600 మెగావాట్ల విద్యుత్ లోటును నివేదించింది.

వాస్తవానికి జార్ఖండ్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం దాదాపు 1,496 మెగావాట్లుగా ఉన్నప్పటికీ.. ఈ పవర్ ప్లాంట్ ప్రస్తుతం ఒక యూనిట్ మాత్రమే పనిచేస్తుండడంతో 700 మెగావాట్ల ఉత్పత్తి మాత్రమే కొనసాగుతోంది. దీనికి ముందు కొన్ని వారాల కిందట అదానీ గ్రూప్ కంపెనీ బంగ్లాదేశ్ పవర్ డెవలప్‌మెంట్ బోర్డుకు రాసిన లేఖలో అక్టోబర్ నెలాఖరు నాటికి పెండింగ్ డబ్బులు చెల్లించాలని కోరింది. చెల్లించడంలో విఫలమైతే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ నిబంధనల ప్రకారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని కూడా తెలిపింది.
రాజకీయ అస్థిరత కొనసాగుతున్న వేళ బంగ్లాదేశ్ పవర్ డెవలప్‌మెంట్ బోర్డ్.. బంగ్లాదేశ్ కృషి బ్యాంక్ నుంచి ఇంకా $170.03 మిలియన్ల బకాయి మొత్తానికి క్రెడిట్ లెటర్‌ను జారీ చేయలేదని, ఇదే క్రమంలో కనీసం బకాయి చెల్లింపు చేయలేదని అదానీ పవర్ తెలిపింది. అయితే భారీ బిల్లును వారం వారీగా బంగ్లాదేశ్ చెల్లిస్తోంది. గతంలో బోర్డు వారానికి 18 మిలియన్ డాలర్లు చెల్లిస్తుండగా.. అయితే పెరిగిన బకాయిల కారణంగా ఇప్పుడు 22 మిలియన్ డాలర్లకు పైగా చెల్లించవలసి వస్తోందని వెల్లడైంది. పవర్ షార్టేజ్ టెక్స్‌టైల్ వ్యాపారాన్ని భారీగా దెబ్బతీస్తోందని తెలుస్తోంది. అదానీ పవర్ డీల్ పై ప్రస్తుత ప్రభుత్వం స్పందిస్తూ ఇది ఖరీదైన డీల్ అని, కొనసాగించటం అసాధ్యమైనది కూడా అని కామెంట్ చేసిన సంగతి తెలిసింది.


Click it and Unblock the Notifications