Adani Enterprises: అదానీ గ్రూప్ ఫ్లాగ్ షిప్ కంపెనీ అదానీ ఎంటర్ ప్రైజెస్ తన మార్చి ఆర్థిక ఫలితాలను నేడు కంపెనీ విడుదల చేసింది. అయితే ఆఫలితాలు ఇన్వెస్టర్లను పూర్తిగా నిరాశకు గురిచేశాయి. దీంతో నేడు మార్కెట్లు ముగిసే సమయంలో కంపెనీ షేర్లు టాప్ లూజర్లలో ఒకటిగా నిలిచింది.
మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 38 శాతం క్షీణించి ఏడాది ప్రాతిపధికన రూ.451 కోట్లుగా నమోదైంది. అయితే దీనికి కారణం తప్పక చేయాల్సిన ఒక ఖర్చని కంపెనీ వెల్లడించింది. దీనికి తోడు ముడి సరకుల ధరల పెరుగుదల లాభాల క్షీణతకు దారితీసినట్లు కంపెనీ పేర్కొంది. అయితే కంపెనీ ఆదాయం మాత్రం స్వల్పంగా 1 శాతం పెరిగి రూ.29,180 కోట్లుగా క్యూ4లో నమోదైంది. అలాగే కంపెనీ ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుపై రూ.1.3 డివిడెండ్ చెల్లించాలని నిర్ణయించింది.

మార్కెట్లు ముగిసే సమయంలో అదానీ ఎంటర్ ప్రైజెస్ కంపెనీ షేర్ ధర ఎన్ఎస్ఈలో క్షీణించి రూ.3,029 వద్ద ట్రేడింగ్ ముగించింది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.3.46 లక్షల కోట్లుగా నిలిచింది. నాలుగో త్రైమాసికంలో వినియోగించే మెటీరియల్‌ల ధర ఏడాదికి రెండింతలు పెరిగి రూ.2,824 కోట్లకు చేరుకోవటం కంపెనీ ఆదాయానికి పెద్ద గండి కొట్టింది. ఇదే క్రమంలో కంపెనీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వహణకు వార్షిక ఫీజుగా రూ.627 కోట్లను మార్చి 2022-సెప్టెంబర్ 2022 కాలానికి చెల్లించినట్లు పేర్కొంది.
అదానీ గ్రూప్ 2050 నాటికి తన పోర్ట్స్, పవర్ అండ్ సిమెంట్ వ్యాపార కార్యకలాపాలను నికర సున్నా ఉద్గార స్థాయిలకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించింది. అలాగే రానున్న 10 ఏళ్ల కాలంలో గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్‌లో $100 బిలియన్ల వరకు పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. గ్రీన్ హైడ్రోజన్ వినియోగాన్ని పెంచాలని గ్రూప్ యోచిస్తోంది. ఇది కార్యకలాపాలను డీకార్బనైజ్ చేయడానికి దోహదపడతాయని భావిస్తోంది.


Click it and Unblock the Notifications