adani: హిండెన్ బర్గ్ ఆరోపణల వల్ల అదానీ గ్రూపు తీవ్ర ఒడిదుడుకులకు లోనైన విషయం తెలిసిందే. ఆయా కంపెనీల అభివృద్ధి ప్రణాళికలపై నీలినీడలు కమ్ముకున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. గతేడాదితో ముగిసిన మూడవ త్రైమాసిక ఫలితాలను అదానీకి చెందిన ఓ కంపెనీ ఈరోజు విడుదల చేయనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ భారతీయ దిగ్గజ వ్యాపారవేత్త భవిష్యత్ ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయనే ఉత్కంఠ మార్కెట్ వర్గాల్లో ఉంది.

ఇవి గమనించండి:
డిసెంబరు 2022 త్రైమాసిక ఫలితాలను అదానీ ఎంటర్ ప్రైజెస్ ఫిబ్రవరి 14న నివేదించనుంది. ఈ కంపెనీ FPO సమయంలోనే హిండెన్ బర్గ్ తన నివేదికను విడుదల చేసి వివాదానికి తెరతీసింది. ఈ నేపథ్యంలో గమనించాల్సిన విషయాలేంటో చూద్దాం.

FPOతో షాక్:
FPO ద్వారా పెద్ద మొత్తంలో నిధులు సేకరించాలని అదానీ గ్రూపు భావించింది. ఈ క్రమంలో జరిగిన ఆరోపణల వల్ల స్టాక్, బాండ్ విలువలో భారీ క్షీణత ఏర్పడింది. కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ, రికార్డు స్థాయిలో రూ.20 వేల కోట్ల విలువైన మొత్తం షేర్ల సబ్ స్రైబ్ అయ్యాయి. తర్వాతి రోజు ఆకస్మికంగా FPO విరమించుకున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చింది.

MSCI ఫ్రీ ఫ్లోట్స్:
అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్‌మిషన్, ACC కంపెనీల ఫ్లోట్‌లను గ్లోబల్ ఇండెక్స్ ప్రొవైడర్ MSCI గత వారం తగ్గించింది. ఇది అదానీ గ్రూపునకు పెద్ద ఎదురుదెబ్బ. అయినప్పటికీ మిగిలిన కంపెనీల ఫ్రీ ఫ్లోట్‌లను అలాగే ఉంచడం కొంత మేర ఉపశమనం కలిగించే విషయం.

ఇంకా నిఘాలోనే:
మూడు అదానీ గ్రూపు స్టాక్ లను నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE).. స్వల్పకాలిక అదనపు నిఘా కొలత (ASM) ఫ్రేమ్‌వర్క్ కింద ఉంచిది. అయితే ఫిబ్రవరి 13 తర్వాత నుంచి అదానీ పోర్ట్స్ & స్పెషల్ ఎకనామిక్ జోన్ మరియు అంబుజా సిమెంట్స్ అనే రెండు కంపెనీలను ఈ జాబితా నుంచి తొలగించింది. కానీ ఈరోజు ఫలితాలు విడుదలవుతున్న అదానీ ఎంటర్ ప్రైజెస్ షేర్లు మాత్రం ఇంకా ఫ్రేమ్‌వర్క్‌లోనే కొనసాగుతున్నాయి. గ్రూప్ కంపెనీల స్టాక్ పతనం మధ్య అదానీ ఎంటర్ ప్రైజెస్ షేర్లు ఒక నెలలోనే 52 శాతానికి పైగా క్షీణించాయి.

అంచనాల్లో సగానికి కోత:
మార్కెట్ లో ఎదుర్కొన్న ఈ భారీ దెబ్బతో అదానీ గ్రూపు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు బ్లూమ్ బర్గ్ నివేదిక వెల్లడించింది. ఆయా కంపెనీల ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని సగానికి తగ్గించినట్లు తెలిపింది. తాజా మూలధన వ్యయాన్ని సైతం నిలిపివేయాలని యోచిస్తున్నట్లు సోమవారం పేర్కొంది. తద్వారా రాబోయే ఆర్థిక సంవత్సరానికి ఆదాయ వృద్ధిని కనీసం 15 నుంచి 20 శాతం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పింది. ఈ ఆరోపణలకు ముందు వాస్తవానికి 40 శాతం విస్తరణను లక్ష్యంగా చేసుకుందని గమనించాలి.

ఆర్థిక మంత్రితో సెబీ భేటీ:
అదానీ గ్రూపు ఉపసంహరించుకున్న 2.5 బిలియన్ డాలర్ల FPO విషయం దర్యాప్తుపై ఆర్థిక మంత్రిత్వశాఖతో సెబీ సమావేశం కానున్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ మరో నివేదికలో తెలిపింది. ఇందుకోసం ఫిబ్రవరి 15న సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) అధికారులు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశం కానున్నట్లు వెల్లడించింది.


Click it and Unblock the Notifications