Q3 Results: క్యూ3లో అదానీ ఎంటర్‌ప్రైజెస్ లాభాలు డబుల్.. స్టాక్ రంకెలు..
Adani Enterprises: అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీలు వరుసగా ఒకటి తర్వాత మరొకటి తమ డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను ప్రకటిస్తున్నాయి. గతంలో కంటే చాలా కంపెనీల లాభాలు రెండింతలకు పైగా పెరగటం ప్రస్తుతం ఇన్వెస్టర్లలో జోష్ నింపుతోంది.
అదానీ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ 2023-24 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.1,888 కోట్ల నికర లాభం నమోదు చేసింది. ఇది గత ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.820 కోట్ల నికర లాభం కంటే 130 శాతం అధికం కావటంతో పెట్టుబడిదారుల్లో కోలాహలం నెలకొంది. ఇక ఆదాయాలను పరిశీలిస్తే గత ఏడాది కాలంలో రూ.26,612 కోట్ల నుంచి 6.48 శాతం పెరిగి రూ.28,336 కోట్లకు పెరిగింది.

త్రైమాసిక ఫలితాలు వెలువడిన తర్వాత కంపెనీ షేర్లు నేడు మార్కెట్లో 3.04 శాతం పెరిగి ఏడాది గరిష్ఠ స్థాయి రూ.3,236.55ను తాకాయి. అదానీ బొగ్గు వ్యాపారంలో EBITDA.. 70 శాతం పెరిగి రూ.1,464 కోట్లకు చేరుకోగా, అదానీ న్యూ ఎనర్జీ EBITDA 194 శాతం పెరిగి రూ.67,300 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడైంది. వాస్తవానికి బొగ్గు ధరలు తగ్గినప్పటికీ.. బొగ్గు ట్రేడింగ్‌లో అధిక మార్జిన్లు, వాల్యూమ్‌లు పెరగటమే ప్రధాన కారణంగా అదానీ ఎంటర్‌ప్రైజెస్ తెలిపింది.
అధిక మార్జిన్లకు బలమైన వ్యయ నిర్వహణను కంపెనీ ఆపాదించింది. దీని మొత్తం ఖర్చులు 1 శాతం పెరిగాయి. డిసెంబర్ 2023 నాటికి ప్రమోటర్లు కంపెనీలో 72.61 శాతం వాటాను కలిగి ఉన్నట్లు వెల్లడైంది. అదానీ కంపెనీ వ్యాపారాల పనితీరు మెరుగుపడటంతో పాటు హిండెన్ బర్గ్ ఆందోళనలు తగ్గటంతో షేర్లలో క్రయవిక్రయాలు భారీగా పెరిగాయి. అయితే గురువారం మార్కెట్లు ముగిసే సమయంలో స్టాక్ ఎన్ఎస్ఈలో 0.37 శాతం లాభపడి రూ.3,153.50 వద్ద ప్రయాణాన్ని ముగించింది.


Click it and Unblock the Notifications