Adani news: అదానీ ఎంటర్‌ప్రైజెస్ లాభాల్లో భారీగా క్షీణత.. దెబ్బేసిన బొగ్గు బిజినెస్!
Adani news: బిజినెస్ టైకూన్ గౌతమ్ అదానీకి ఈ ఏడాది ఏమాత్రం బాగోలేదు. హిండెన్ బర్గ్ నివేదికల వల్ల తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. పార్లమెంటులోనూ ఈ వ్యవహారంపై దుమారం చెలరేగింది. అయితే ఏదో ఒకవిధంగా ఇన్వెస్టర్ల మెప్పు పొందగలిగారు. రుణాలను సైతం తగ్గించుకున్నారు. కానీ గ్రూపులోని కొన్ని కంపెనీలు ఇంకా నష్టాలను చవిచూస్తూనే ఉన్నాయి.
సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ ఏకీకృత నికర లాభం భారీగా క్షీణించింది. YoY 51 శాతం తగ్గుదల నమోదై.. 227.82 కోట్లకు చేరుకుంది. ఇక ఆదాయం ఏడాదిలో 41 శాతం పడిపోయి 22 వేల 517 కోట్లకు పరిమితమైంది. ఇతర ఆదాయం 549 కోట్లు పెరిగినప్పటికీ నికర లాభంలో భారీ పతనం చవిచూడాల్సి వచ్చింది.

ఈ త్రైమాసికంలో టాప్‌లైన్ మరియు బాటమ్‌లైన్ బాగా పడిపోయాయి. అయితే అదానీ ఎంటర్ ప్రైజెస్ మాత్రం మెరుగైన EBITDAను కనబరిచింది. ఆపరేషనల్ పర్ఫార్మెన్స్ 30 శాతం పెరిగి 2 వేల 430 కోట్లకు చేరుకుంది. ఫలితంగా ఆపరేటింగ్ మార్జిన్ ఏడాదికి 589 బేసిస్ పాయింట్లు మెరుగుపడి 10.79 శాతం వద్ద కుదురుకుంది. మార్చి చివరి నాటికి అదానీ ఎంటర్‌ప్రైజెస్ స్థూల రుణం 38 వేల 320 కోట్లు కాగా.. సెప్టెంబర్ నాటికి ఇవి 42 వేల 102 కోట్లకు పెరిగాయి.
అనుబంధ సంస్థ ముంద్రా సోలార్ PV లిమిటెడ్ వల్ల గ్రూప్ భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. అమ్మకానికి ఉంచిన దాని ఆస్తుల వాస్తవ విలువలో తగ్గుదల కారణంగా 88 కోట్లు నష్టపోయింది. అయితే బలమైన ఇంక్యుబేటింగ్ వ్యాపారాల ద్వారా EBITDAలో మంచి వృద్ధి నమోదైనట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
అదానీ ఎంటర్‌ప్రైజెస్ నగదు నిల్వలు ఏడాదికి 26 శాతం పెరిగి 1,242 కోట్లకు చేరాయి. ఇక ఈ త్రైమాసికంలో ANIL ఎకోసిస్టమ్ క్రింద ఉన్న గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్‌లు, విమానాశ్రయాల బిజినెస్ పనితీరు బాగుంది. అయితే తక్కువ పరిమాణం సహా బొగ్గు ధరల్లో సవరణ కారణంగా ఇంటిగ్రేటెడ్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ (IRM) వ్యాపారం దెబ్బతింది. దీని బలహీన పెర్ఫార్మెన్స్ కంపెనీ మొత్తం ఆదాయాలను ప్రభావితం చేసింది.


Click it and Unblock the Notifications