Adani News: ఓటమి అంగీకరించిన అదానీ.. ఆ కంపెనీ అమ్మకం, విధి వింత నాటకం..
Adani Wilmar: అదానీ గ్రూప్ 2024లో అనేక కుదుపులకు గురైంది. ఈ క్రమంలో గ్రూప్ వ్యాపారాలు ఒక పక్క ఆరోపణలు ఎదుర్కొంటుండగా, మరో పక్క కంపెనీ ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని వదులుకున్నట్లు ప్రకటించింది. వాస్తవానికి తొలిసారిగా అదానీ గ్రూప్ ఒక వ్యాపారాన్ని పూర్తిగా మూసివేయటం దాదాపు ఇదే మెుదటిసారని చెప్పుకోవచ్చు. అసలు అదానీకి ఏమైందనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
తాజాగా అదానీ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ అదానీ విల్మార్ జాయింట్ వెంచర్ నుంచి పూర్తిగా తప్పుకుంది. ఈ క్రమంలో భాగంగా కనీస పబ్లిక్ షేర్‌హోల్డింగ్ ప్రమాణానికి అనుగుణంగా తన 13% వాటాను అదానీ గ్రూప్ విక్రయించగా.. మిగిలిన 31% వాటా సింగపూర్‌కు చెందిన విల్మార్ ఇంటర్నేషనల్‌కు వెళ్లనుంది. ఈ మేరకు కంపెనీ డిసెంబర్ 30న తన స్టాక్ ఎక్స్ఛేంజీ ఫైలింగ్స్ లో ఇదే విషయాన్ని వెల్లడించింది. కంపెనీ తాజా నిష్కమణ ద్వారా దేశంలోని ఎఫ్ఎంసీజీ వ్యాపారం నుంచి పక్కకు తప్పుకుంది. అలాగే వాటాల విక్రయంతో అదానీ గ్రూప్ దాదాపు 2 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఆదాయాన్ని కూడా సమకూర్చుకుంది. గతంలో చెప్పినట్లుగానే విక్రయాల ద్వారా వచ్చిన మెుత్తాన్ని కంపెనీ తన కోర్ వ్యాపారాల మూలధన అవసరాల కోసం ఈ డబ్బును వినియోగించే అవకాశం ఉందని తెలుస్తోంది.

వాస్తవానికి అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ కమోడిటీస్ ఎల్‌ఎల్‌పి, విల్మార్ ఇంటర్నేషనల్ అనుబంధ సంస్థ లెన్స్ ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం అదానీ కమోడిటీస్ ఎల్‌ఎల్‌పి కలిగి ఉన్న అదానీ విల్‌మార్‌లో లెన్స్ 31.06% వాటాను కొనుగోలు చేస్తుందని కంపెనీ ప్రకటన తెలిపింది. విల్మార్ అదానీ మిగిలిన 31% వాటాను ఒక్కో షేరుకు రూ.305 కంటే ఎక్కువ ధరతో కొనుగోలు చేస్తుంది. ఈ డీల్ మార్చి 2025 నాటికి పూర్తవుతుందని తెలుస్తోంది. అదానీ ఎంటర్ ప్రైజెస్ విల్మార్ వ్యాపారంలోని 13 శాతం వాటాలను ఆఫర్ ఫర్ సేల్ రూపంలో విక్రయించటం ద్వారా కనీస పబ్లిక్ షేర్‌హోల్డింగ్ అవసరాలను సాధించాలని నిర్ణయించింది.
దీనిలో భాగంగా అదానీకి చెందిన నామినీ డైరెక్టర్లు అదానీ విల్మార్ బోర్డు నుంచి కూడా ప్రస్తుతం వైదొలగుతున్నారు. ఈ క్రమంలోనే కంపెనీ పేరును 'AWL లిమిటెడ్' లేదా 'AWL అగ్రి బిజినెస్ లిమిటెడ్' లేదా 'ఫార్చ్యూన్ అగ్రి బిజినెస్ లిమిటెడ్'గా మార్చడానికి తదుపరి చర్యలు తీసుకోవడానికి వాటాదారులు అంగీకరించారు. అదానీ గ్రూప్ తన విల్మార్ ఎగ్జిట్ వార్తలు నిన్న మార్కెట్లోకి రావటంతో అదానీ ఎంటర్ ప్రైజెస్ స్టాక్ ధర దాదాపు 7 శాతం మేర లాభపడింది. ప్రస్తుతం అదానీ గ్రూప్ ఇండియాలో ఇన్ ఫ్రా, మౌలిక సదుపాయాలు, పవర్ వంటి కోర్ వ్యాపారాలపై దృష్టిపెట్టే క్రమంలో తాజా విక్రయ నిర్ణయం వచ్చిందని తెలుస్తోంది.
అదానీ విల్మార్‌లో అదానీ గ్రూప్, విల్మార్ ఇంటర్నేషనల్ దాదాపు 44% ఆధీనంలో ఉన్నాయి. ఈ 88% మొత్తం వాటాను ఫిబ్రవరి నాటికి 75%కి తగ్గించాల్సిన అవసరం ఉంది. అదానీ విల్మార్ కంపెనీ 2022లో తన ఐపీవోను దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్ట్ చేయబడింది. ప్రస్తుతం అదానీ విల్మార్ దేశంలోని 100 శాతం నగరాలను కవర్ చేస్తుండగా.. 30,600 కంటే ఎక్కువ గ్రామీణ పట్టణాలలో ఉనికిని కలిగి తన ఉత్పత్తులను విక్రయిస్తోంది. ఇదే క్రమంలో దాదాపు 30 దేశాలకు తన ఉత్పత్తులను ఎగుమతిచేస్తోంది. ప్రస్తుతం అదానీ విల్మార్ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ.42,800 కోట్లుగా ఉంది.


Click it and Unblock the Notifications