Adani Energy Solutions: గతంలో అదానీ ట్రాన్స్‌మిషన్‌గా ఉండి ప్రస్తుతం అదానీ సొల్యూషన్స్‌గా పేరుమార్చబడిన కంపెనీ నేడు తన ఏప్రిల్-జూన్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.
నేడు విడుదల చేసిన త్రైమాసిక ఫలితాల్లో కంపెనీ రూ.823.92 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. అయితే ఏడాది కిందట కంపెనీ ఇదే త్రైమాసికంలో రూ.175 కోట్ల లాభాన్ని చూసింది. పెరిగిన ఖర్చులు, దహను థర్మల్ పవర్ ప్లాంట్ ఉపసంహరణ వల్ల అసాధారణమైన ఖర్చులు ప్రస్తుత నష్టాలకు కారణంగా కంపెనీ పేర్కొంది. ఇదే క్రమంలో వ్యాపార ఆదాయం గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే 47 శాతం పెరిగి రూ.5,378.6 కోట్లుగా ఉన్నట్లు అదానీ గ్రూప్ ఫలితాల్లో నివేదించింది.

మెుదటి త్రైమాసికంలో కంపెనీ EBITDA 30 శాతం పెరిగి రూ.1,628 కోట్లుగా ఉన్నట్లు ప్రకటించింది. పవర్ ప్లాంట్‌ను ఉపసంహరించుకోవడం వల్ల కంపెనీ రూ.1,506 కోట్ల వన్-టైమ్ ఖర్చు చేసింది. అనుబంధ సంస్థ అయిన అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్ పవర్ ప్లాంట్‌ను సంబంధిత పార్టీకి రూ.815 కోట్లకు విక్రయించడానికి ఆమోదించింది. ఇది వాస్తవంగా కంపెనీ బుక్ వ్యాల్యూ రూ.2,321.02 కోట్ల కంటే చాలా తక్కువ కావటంతో భారీ నష్టం చూసింది. ఈ ఒప్పందం ఇప్పటికీ అవసరమైన రెగ్యులేటరీ అనుమతులకు లోబడి ఉందని అదానీ ఎనర్జీ తెలిపింది.
అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 14 రాష్ట్రాల్లో ఉనికిని కలిగి ఉన్న భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ పవర్ ట్రాన్స్‌మిషన్ కంపెనీల్లో ఒకటి. ఇది పవర్ ట్రాన్స్మిషన్లు, పవర్ డిస్ట్రిబ్యూషన్, స్మార్ట్ మీటరింగ్, కూలింగ్ సొల్యూషన్స్ వ్యాపారాలను నిర్వహిస్తోంది. ఇటీవల ప్రారంభించిన వరోరా కర్నూలు, కరూర్, ఖర్ఘర్-విక్రోలి, ఖవదా-భుజ్ ట్రాన్స్‌మిషన్ లైన్‌ల సహకారంతో 47 శాతం ఆదాయ వృద్ధిని సాధించినట్లు కంపెనీ పేర్కొంది. నేడు కంపెనీ షేర్లు మార్కెట్ల క్లోజింగ్ సమయానికి 2.08 శాతం లాభపడి రూ.1057.80 వద్ద స్థిరపడింది.


Click it and Unblock the Notifications