adani: అదానీ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఒకటి వెనకాల మరోటి దెబ్బ పడుతూనే ఉంది. హిండెన్ బర్గ్ ఆరోపణల అనంతరం గ్రూపు కంపెనీల స్టాక్స్ తీవ్ర నష్టాల్లోకి జారుకోవడం తెలిసిందే. తద్వారా ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ 5 లో ఉండాల్సిన గౌతమ్ అదానీ.. 25 వ స్థానానికి పడిపోయారు. ఈ హీట్ చల్లారక ముందే వికీపీడియా సైతం ఇటీవలే విరుచుకుపడింది. తాజాగా ఇప్పటికే ఓ కంపెనీతో జరిగిన ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.

చట్టపరమైన చిక్కులతో..
మహారాష్ట్రలో సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ (CGU)ను ఏర్పాటు చేయాలని CK బిర్లా గ్రూపులో భాగమైన ఓరియంట్ సిమెంట్ భావించింది. అందుకు గాను అదానీ పవర్ మహారాష్ట్ర లిమిటెడ్ (APML)తో ఒప్పందం సైతం కుదుర్చుకుంది. దానినే ఇప్పుడు రద్దు చేసుకున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజ్ లకు అప్ డేట్ ఇచ్చింది. చట్టరీత్యా ఉన్న చిక్కుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

క్లియరెన్స్ లో విఫలం:
CGU ఏర్పాటు కోసం అవసరమైన భూమిని మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (MIDC) ద్వారా సబ్ లీజుకు ఇవ్వాల్సి ఉంది. అందుకు సంబంధించిన క్లియరెన్స్ లు పొందడంలో APML విఫలమైనట్లు ఓరియంట్ పేర్కొంది. అందువల్ల ఈ ప్రాజెక్టులో ముందుకు సాగలేమని అదానీ కంపెనీ అభ్యర్థించినట్లు వెల్లడించింది. దానికి తోడు ఒప్పందం ప్రకారం నిర్ణయించిన గడువు సైతం పూర్తి అయినందున తాము అందుకు అంగీకరించినట్లు చెప్పింది.

డీల్ రద్దు:
మహారాష్ట్రలోని తిరోడాలో CGUని నెలకొల్పేందుకు సెప్టెంబర్ 2021లో APMLతో ఓరియంట్ సిమెంట్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందుకోసం గోండియా జిల్లాలోని సుమారు 35 ఎకరాల భూమిని అనువైనదిగా గుర్తించింది. దానిని ఉపయోగించుకోవడం కోసం చట్టబద్ధ లీజుదారు అయిన APMLతో కలిసి ముందుకు సాగాలని భావించింది. కానీ సంబంధిత ప్రభుత్వ శాఖ నుంచి అనుమతులు పొందలేకపోవడంతో ఈ డీల్ రద్దు చేసుకుంది.


Click it and Unblock the Notifications