Adani..దీన్నీ వదలట్లే: కొత్తగా సిమెంట్ రంగంలో ఎంట్రీ: రూ.10 లక్షలతో
ముంబై: దేశీయ పారిశ్రామిక దిగ్గజం.. కరోనా సంక్షోభ సమయంలోనూ తన ఆస్తులను అపారంగా పెంచుకోగలిగిన కొమ్ములు తిరిగిన కార్పొరేట్ బిగ్‌షాట్.. గౌతమ్ అదాని- కొత్తగా మరో రంగంలోకి అడుగు పెట్టారు. సిమెంట్ ఉత్పాదక రంగంలో ఎంట్రీ ఇచ్చారు. దీనికోసం కొత్తగా అదాని సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ACIL)ను నెలకొల్పారు. అదాని గ్రూప్ సంస్థల్లో దీన్ని ఇన్‌కార్పొరేట్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు బోంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో ఫైలింగ్ చేశారు. ఏసీఐఎల్ పేరు కింద సిమెంట్ ఉత్పత్తి, ప్రాసెస్‌ను కొత్తగా చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కంపెనీ పేరు కింద ఇంకా వాణిజ్యపరమైన కార్యకలాపాలను ఇంకా ఆరంభించాల్సి ఉందని పేర్కొన్నారు.
అదాని గ్రూప్ సంస్థలు.. ఇప్పటికే పలు రంగాల్లో తమ వ్యాపార సామాజ్రాన్ని విస్తరించుకున్న విషయం తెలిసిందే. ఓడరేవులు, విమానాశ్రయాలు, గ్యాస్ పంపిణీ, ఉక్కు తయారీ వంటి మౌలిక సదుపాయాల రంగంతో ముడిపడి ఉన్న రంగాలకు విస్తరించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా సిమెంట్ ఉత్పాదక రంగంలోనూ అడుగు పెట్టింది. 10 లక్షల రూపాయల షేర్ క్యాపిటల్‌తో అదాని సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ను ప్రారంభించనున్నట్లు ఎక్స్‌ఛేంజ్‌లో దాఖలు చేసిన ఫైలింగ్స్‌లో తెలిపిందా సంస్థ యాజమాన్యం. పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్‌ను అయిదు లక్షల రూపాయలుగా నిర్ధారించినట్లు తెలిపింది.

అదాని సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే పేరును శుక్రవారమే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ వద్ద రిజిస్టర్ చేయించినట్లు వెల్లడించింది. ఈ కంపెనీ కింద అన్ని రకాల సిమెంట్‌ను ఉత్పత్తి చేస్తామని తెలిపింది. ఇదిలావుండగా- విమానాశ్రయాల రంగంలో తన వాటాను మరింత విస్తరించుకోవడంలో భాగంగా అదాని ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ షేర్లను ప్రైవేట్ ప్లేస్‌మెంట్ చేయడం ద్వారా 500 మిలియన్ డాలర్ల మేర నిధులను సమీకరించుకోవడంపై గౌతమ్ అదాని దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అలాగే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)కు వెళ్లాలని భావిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications