Sanghi Industries: అదానీ కంపెనీల షేర్లపై హిండెన్ బర్గ్ ఆరోపణలు జరిగి ఏడాది పూర్తైంది. ఈ క్రమంలో కంపెనీ తన విస్తరణ ప్రణాళికను పూర్తిగా మార్చేసి కోర్ వ్యాపారాలకు పరిమితం కావాలని నిర్ణయించింది.
అలా దేశంలోని ఇన్‌ఫ్రా రంగంపై ఎక్కువగా దృష్టి సారించిన అదానీ సిమెంట్ వ్యాపారాన్ని టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. అదానీ గ్రూప్ సిమెంట్ కంపెనీ అయిన సంఘీ ఇండస్ట్రీస్ డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. మూడో త్రైమాసికంలో కంపెనీ నష్టాలు పెరిగాయి. ఏడాది ప్రాతిపదికన సంఘీ సిమెంట్స్ నష్టం రూ.144 కోట్ల నుంచి రూ.201.4 కోట్లకు పెరగటం ఆందోళన కలిగిస్తోంది. ఇదే సమయంలో కంపెనీ వ్యాపార ఆదాయం రూ.133.7 కోట్ల నుంచి రూ.189.1 కోట్లకు పెరిగింది.

సంఘీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్లు గత కొన్ని రోజులుగా ఒత్తిడి కొనసాగాయి. వారం చివరి ట్రేడింగ్ రోజున షేరు ధర రూ.120 వద్ద ముగిసింది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.156.20గా ఉంది. అలాగే ఫిబ్రవరి 2023లో 52 వారాల కనిష్ఠ ధర రూ.53గా ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా పెట్టుబడిదారులు కంపెనీ నుంచి తమ డబ్బును వెనక్కి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో తాజాగా కంపెనీ షేర్లు 10 శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
అదానీ గ్రూప్‌నకు చెందిన మరో కంపెనీ అంబుజా సిమెంట్స్‌తో సిమెంట్ సరఫరా ఒప్పందమే షేర్ల విక్రయానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇందులో అంబుజా, ACC కంపెనీ నుంచి 10 శాతం ఎక్కువ ధరతో క్లింకర్, సిమెంట్‌ను పెద్దమొత్తంలో కొనుగోలు చేసి అంబుజా, ACC కింద విక్రయిస్తాయి. దీంతో సంఘీ ఇండస్ట్రీస్ లాభాలపై ఆందోళనలు పెరిగాయి.
ఈ సరఫరా ఒప్పందానికి ఆమోదం కోసం సంఘీ ఇండస్ట్రీస్ ఫిబ్రవరి 8న అసాధారణ సాధారణ సమావేశాన్ని కూడా పిలిచింది. వాస్తవానికి గత ఏడాది అదానీకి చెందిన అంబుజా సిమెంట్స్ సంఘీ ఇండస్ట్రీస్ ప్రమోటర్లు రవి సంఘీ కుటుంబం నుంచి 56.74 శాతా వాటాను కొనుగోలు చేసింది. దీంతో బిర్లాలకు చెందిన అల్ట్రాటెక్ తర్వాత దేశంలో రెండవ అతిపెద్ద సిమెంట్ తయారీదారుగా అంబుజా అవతరించింది.


Click it and Unblock the Notifications