IT News: రోజులు మారాయ్. ఒకప్పుడు ఐటీ కంపెనీలు ప్రధానంగా బెంగళూరు, ముంబై, దిల్లీ వంటి ప్రధాన టైర్ I నగరాలకు కార్యకలాపాలను పరిమితం చేశాయి. దశాబ్దాల ప్రయాణం తర్వాత ఇప్పుడు కంపెనీలు టైర్ II, టైర్ III నగరాల్లోకి ప్రవేశించడం ప్రారంభించాయి.
కరోనా కాలంలో తీసుకొచ్చిన వర్క్ ఫ్లమ్ హోమ్ విధానం కంపెనీల కార్యకలాపాల్లో కీలకమైన మార్పులకు దారితీసింది. అందుకే అవి ఉద్యోగులకు సమీపంలోని ప్రధాన నగరాల్లో కార్యాలయాలను ప్రారంభిస్తున్నాయి. ఇటీవల కర్ణాటకలోని యెలహంకలో ఇన్ఫోసిస్ కొత్త ఆఫీసును తెరవటం దీనికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

ఇంటి వద్ద నుంచి పనిచేసేందుకు చాలా కాలంగా అలవాటు పడిపోయిన ఉద్యోగులను తిరిగి రప్పించేందుకు కంపెనీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల టీసీఎస్, ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులు తప్పక కార్యాలయాలకు రావాల్సిందేనని వెల్లడించింది. దీనికి తోడు పెద్ద టెక్ కంపెనీలన్నీ హైబ్రిడ్ వర్క్ విధానాన్ని తప్పనిసరి చేశాయి. ఈ స్ట్రాటజీలో భాగంగా ఇన్ఫోసిస్ ఏపీలోని విశాఖలో, తమిళనాడులోని కోయంబత్తూర్ వంటి టైర్ II నగరాల్లో కంపెనీ కార్యాలయాలను కూడా ప్రారంభించింది.
ఇదే క్రమంలో యాక్సెంచర్ కొన్ని నెలల క్రితం జైపూర్, కోయంబత్తూర్‌లలో కార్యాలయాలను స్థాపించింది. ఇదే తరహాలో ఐబీఎమ్ సైతం తన కేంద్రాలను టైర్ II, టైర్ III నగరాలకు తీసుకొచ్చే పనిని ప్రారంభించిందని భారతదేశం-దక్షిణాసియా MD సందీప్ పటేల్ తెలిపారు. ఇదే క్రమంలో ఐటీ మేజర్ టీసీఎస్ భువనేశ్వర్, కొచ్చి, తిరువనంతపురం, నాగ్‌పూర్, ఇండోర్, వారణాసి, గాంధీనగర్ వంటి టైర్ II నగరాల్లో కార్యాలయాలను కలిగి ఉంది. చిన్న నగరాల్లోని టాలెంట్ ను ఆకర్షించేందుకు కంపెనీలు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

కరోనా సమయంలో స్వస్థలాలకు వెళ్లిన ఉద్యోగులు హైబ్రిడ్ విధానం అమలులోకి రావటంతో తిరిగి నగరాలకు వెళ్లేందుకు నిరాకరిస్తున్నారు. ఇదే సమయంలో టైర్ II, టైర్ III ఇంటర్నెట్ వ్యాప్తి, విద్య, మౌలిక సదుపాయాలు, సరఫరా గొలుసులు, రవాణా, లాజిస్టిక్స్ అభివృద్ధి చెందటంతో కంపెనీలు సైతం దిగొస్తున్నాయి. కంపెనీలకు సైతం రియల్ ఎస్టేట్, నిర్వహణ ఖర్చులు కూడా తగ్గాయి.


Click it and Unblock the Notifications