భారత ఐటీ ఉద్యోగాలు: ఏఐ దెబ్బకు షాక్.. కానీ ఈ డీల్ జాక్‌పాట్!
ఏఐ టెక్నాలజీ దెబ్బకు టెక్ పరిశ్రమ మొత్తం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న వేళ, భారత ఐటీ ఉద్యోగులకు యాక్సెంచర్ రూపంలో ఓ జాక్‌పాట్ తగిలింది.
ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ 'క్వాంటాస్' (Qantas) ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఏవియేషన్, పర్యాటక రంగాల్లో ఏఐ టెక్నాలజీ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, తమ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాలని, వ్యాపారాన్ని పునర్వ్యవస్థీకరించాలని భావిస్తోంది. ఈ ముఖ్యమైన ట్రాన్స్ఫార్మేషన్ ప్రాజెక్టును అవుట్సోర్స్ చేయాలని నిర్ణయించింది.
ఇప్పటివరకు క్వాంటాస్ తన టెక్ పనుల్లో చాలా వరకు సొంతంగానే (ఇన్-హౌస్) చేసుకునేది. కానీ ఇప్పుడు ఆ పనులను అవుట్సోర్సింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది.

ఇందుకోసం క్వాంటాస్, యాక్సెంచర్ మధ్య పలు సంవత్సరాల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం 850 మంది ఉద్యోగుల పనులను అవుట్సోర్స్ చేయనున్నారు. ఈ పనుల్లో అధిక భాగం భారత్ నుంచే నిర్వహించనుండటం విశేషం.
ఈ నిర్ణయంతో యాక్సెంచర్ ఇండియా ఆఫీసులో కొత్త ఉద్యోగ అవకాశాలు భారీగా పెరగనున్నాయి. మరోవైపు, క్వాంటాస్ సీఈఓ వెనెస్సా హడ్సన్ తమ ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్లో, "ఈ వార్త చాలా మందికి షాకింగ్‌గా, బాధ కలిగించేలా ఉండొచ్చు. కంపెనీలో ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు నన్ను క్షమించండి" అని పేర్కొన్నారు.
"యాక్సెంచర్ మన టెక్నాలజీని మెరుగుపరుస్తుంది. ఈ క్రమంలో ఆదా అయ్యే భారీ మొత్తాన్ని కస్టమర్ సేవలు, భవిష్యత్ వృద్ధి ప్రణాళికలపై పెట్టుబడిగా పెడతాం" అని ఆమె వివరించారు.
ఈ అవుట్సోర్సింగ్ ద్వారా టెక్నాలజీ, ఏఐ సాయంతో టెక్ డెవలప్మెంట్ మరింత వేగవంతం అవుతుందని వెనెస్సా హడ్సన్ తెలిపారు. ఈ ప్రక్రియ వచ్చే ఏడాది మధ్యలో మొదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
మొదటి దశలో ఫైనాన్స్, ప్రొక్యూర్మెంట్, హెచ్ఆర్, మార్కెటింగ్ వంటి విభాగాల్లోని పనులను యాక్సెంచర్‌కు బదిలీ చేయనున్నారు. ఈ సేవల్లో అధిక భాగం భారత్ నుంచే పొందనున్నట్లు వెనెస్సా హడ్సన్ స్పష్టం చేశారు.
అంతేకాకుండా, ఈ మార్పు వల్ల ఉద్యోగాలు కోల్పోయే వారికి నైపుణ్య శిక్షణ (స్కిల్ డెవలప్మెంట్) ఇచ్చి, కంపెనీలోని ఇతర విభాగాల్లో నియమించుకునే అవకాశం కూడా కల్పిస్తామని వెనెస్సా హడ్సన్ హామీ ఇచ్చారు.


Click it and Unblock the Notifications