యాక్సెంచర్ జీతాల పెంపు: 50:50 విధానం.. మీ జీతంపై ప్రభావం ఎంత?
సాధారణంగా కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు ఏడాదికి ఒకసారి జీతాల పెంపు ఉంటుంది. బేసిక్ శాలరీపై కొంత శాతం హైక్ ఇస్తుంటారు. దీంతో నెలనెలా వచ్చే జీతం పెరుగుతుంది. కానీ, ప్రపంచ ప్రఖ్యాత ఐటీ సంస్థ యాక్సెంచర్ (Accenture) మాత్రం ఈసారి జీతాల పెంపులో '50:50' అనే కొత్త విధానాన్ని ప్రకటించింది.
తమ కంపెనీలో పనిచేస్తున్న సుమారు 7 లక్షల మందికి పైగా ఉద్యోగులకు జీతాల పెంపుపై యాక్సెంచర్ పంపిన ఓ సర్క్యులర్ ఇప్పుడు టెక్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. జీతాల పెంపును ఇకపై రెండు భాగాలుగా విభజించి ఇవ్వాలని నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. అంటే, శాలరీ హైక్‌ను 50:50గా విభజిస్తున్నారన్నమాట.
ఉద్యోగికి ఇచ్చే మొత్తం హైక్‌లో 50% మొత్తాన్ని ఎప్పటిలాగే బేసిక్ శాలరీకి శాశ్వతంగా యాడ్ చేస్తారు. దీనివల్ల నెలవారీ జీతం పెరుగుతుంది. ఇక మిగిలిన 50% మొత్తాన్ని జూన్ నెల జీతంతో పాటు ఒకేసారి వన్-టైమ్ పేమెంట్‌గా (One-time payment) బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది.

ఉదాహరణకు, మీకు 3% జీతం పెంపు లభించిందనుకుందాం. అందులో 1.5% మీ నెలవారీ బేసిక్ శాలరీకి (Base Pay) శాశ్వతంగా యాడ్ అవుతుంది. మిగిలిన 1.5% మొత్తాన్ని లెక్కించి, జూన్ నెలలో ఒకేసారి లంప్ సమ్ (Lump sum) రూపంలో చేతికి అందిస్తారు.
ప్రస్తుత ప్రపంచ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, కంపెనీ మొత్తం పేరోల్ ఖర్చులను (Payroll costs) సరిగ్గా నిర్వహించడానికి, అలాగే ఉద్యోగుల చేతిలో తక్షణ నగదు లభ్యతను పెంచడానికే ఈ 50:50 విధానాన్ని తీసుకొచ్చినట్లు యాక్సెంచర్ వివరించింది. ఈ పద్ధతి వల్ల, గతేడాది కంటే ఈసారి ఎక్కువ మంది ఉద్యోగులకు జీతాల పెంపు ఇవ్వగలిగామని కూడా కంపెనీ పేర్కొంది.
ప్రమోషన్లు పొందిన ఉద్యోగులకు ఈ కొత్త రూల్ వర్తించదు. వారికి ఎప్పటిలాగే పూర్తి హైక్‌ను బేసిక్ శాలరీకే (Base Pay) కలుపుతారు. అలాగే, జూన్‌లో ఇచ్చే ఈ వన్-టైమ్ లంప్-సమ్ పేమెంట్‌కు, డిసెంబర్‌లో ఇచ్చే వార్షిక బోనస్‌కు ఎలాంటి సంబంధం ఉండదు. అది వేరు, ఇది వేరు అని కంపెనీ స్పష్టం చేసింది.
అంటే, ఈ ఏడాది ఉద్యోగులకు ఇచ్చే జీతం పెంపులో కొంత భాగం మాత్రమే వారి నెల జీతాన్ని పెంచుతుంది, మిగిలిన సగం జూన్‌లో ఒకేసారి పెద్ద మొత్తంలో అందుతుంది. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఒకేసారి వచ్చే పెద్ద మొత్తానికి పన్ను (Tax) ఎలా లెక్కిస్తారనే దానిపై కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications
