సెబీ మాజీ చీఫ్ మాధబి పూరీ బుచ్ పై ఏసీబీ కేస్.. ఇప్పుడు ఎందుకు కేసు కట్టారు..?
Madhabi Puri Buch: భారత స్టాక్ మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ మాజీ చైర్మన్ మాధబి పూరి బుచ్ ప్రస్తుతం కొత్త చిక్కుల్లో ఇరుక్కున్నారు. గతంలో అదానీకి ఆమె సహాయం చేశారంటూ అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీని తర్వాత పూరి బుచ్ దంపతుల పెట్టుబడుల వ్యవహారంలో కూడా అనేక ఆరోపణలు చేసింది.
అయితే తాజాగా మాధబి పూరి బుచ్ సహా ఆరుగురిపై కేసు నమోదు చేయాలని ముంబైలోని కోర్టు ఆదేశించటంతో ఏసీబీ రంగంలోకి దిగింది. 1994లో జరిగిన స్టాక్ మార్కెట్ మోసం, అవినీతి, నియంత్రణ ఉల్లంఘనలకు సంబంధించి ఈ చర్య తీసుకోబడింది. ఈ వ్యవహారంలో కోర్టు తీర్పు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. థానేకు చెందిన జర్నలిస్ట్ సబన్ శ్రీవాస్తవ దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు కేసు ప్రారంభించబడింది. సెబీ అధికారులు తమ విధులను సరిగ్గా నిర్వర్తించలేదని, మార్కెట్ మోసానికి పాల్పడుతున్నారని అందులో ఫిర్యాదుదారుడు ఆరోపించారు.

1994లో బీఎస్ఈలో లిస్టింగ్ కోసం సెబీ ఒక కంపెనీకి అనుమతి ఇచ్చింది. అయితే ఆ కంపెనీ ఆర్థికంగా అస్థిరంగా ఉందని, స్టాక్ మార్కెట్ నియమాలను ఉల్లంఘించిందని ఆరోపణలు వచ్చాయి. అలాగే షేరు ధరలను కావాలని ఇన్ ఫ్లేట్ చేశారని కూడా వెల్లడైంది. ఇలా ఇన్వెస్టర్లను కంపెనీతో పాటు సెబీ అధికారులు ఇన్‌సైడర్ ట్రేడింగ్, మార్కెట్ మానిప్యులేషన్ వంటి చట్టవిరుద్ధమైన కార్యక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేయబడింది. ఈ కుంభకోణంలో మాధబీ బుచ్‌తో పాటు మరో ఐదుగురు కీలక అధికారులు పాల్గొన్నట్లు వెల్లడైంది. ఫిర్యాదులో అందించిన పత్రాలను పరిశీలించిన ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శశికాంత్ ఏక్‌నాథరావు బంగర్ పరిశీలించిన తర్వాత వీరిపై చర్యలు ప్రారంభించబడ్డాయి.
ప్రస్తుతం ఎఫ్ఐఆర్ ప్రకారం కేసులో మాజీ చీఫ్ మాదభి పూరి బుచ్ తో పాటుఅశ్వని భాటియా, అనంత్ నారాయణ్ జీ, కమలేష్ చంద్ర వర్షిణి, బీఎస్ఈ చైర్మన్ ప్రమోద్ అగర్వాల్, బీఎస్ఈ సీఈవో సుందరరామన్ రామమూర్తిలపై చట్టాలకు విరుద్ధంగా మార్కెట్ల తారుమారుకు సంబంధించి కేసు నమోదు చేయబడిందని వెల్లడైంది. స్కామ్‌లో సెబీ అధికారుల ప్రమేయం ఉందని ప్రాథమిక ఆధారాలు ఉండటం ప్రస్తుతం పెద్ద సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించి సెబీ అధికారిక ప్రకటన విడుదల చేస్తూ తాము కోర్టు ఆదేశాలపైపై పోరాడతామని పేర్కొనటం గమనార్హం.
సెబీ ఈ విషయంలో చట్టపరంగా ముందుకు వెళ్లాలని చూస్తున్నప్పటికీ.. మాధబీ బుచ్ పై ఇంతకు ముందు కూడా అనేక విమర్శలు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. కానీ తాను సెబీలో నియామకానికి ముందే పెట్టుబడులు చేశామని.. అవసరమైన అన్ని సమాచారాన్ని తాము బహిర్గతం చేసినట్లు ఆమె సమర్థించుకున్న సంగతి తెలిసిందే. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత, ఎసిబి దర్యాప్తు నిర్వహించి 30 రోజుల్లోపు నివేదిక దాఖలు చేయాలి. ఈ ఉత్తర్వుపై సెబీ అప్పీల్ చేస్తుంది. మార్కెట్ మోసానికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఆర్థిక, స్టాక్ మార్కెట్ నిబంధనలను ఉల్లంఘించిన కంపెనీలపై అదనపు దర్యాప్తులు నిర్వహించవచ్చని వెల్లడైంది.


Click it and Unblock the Notifications