Adani News: ప్రస్తుతం గౌతమ్ అదానీ పరిస్థితి నక్కతోక తొక్కినట్లుగా తయారైంది. ఆయన కంపెనీల్లోకి డబ్బుల వెల్లువ వరద ప్రవాహంలా వస్తోంది. వేల కోట్లు రూపాయలు విదేశీ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులుగా వస్తున్నాయి.
ప్రస్తుతం అదానీకి చెందిన పవర్ కంపెనీ రెండు రోజులుగా మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది. GQG, గోల్డ్‌మాన్ సాచ్స్ తర్వాత అబుదాబి నుంచి పెట్టుబడులు క్యూ కట్టడమే దీనికి కారణం. తాజాగా అబుదాబి నేషనల్ ఎనర్జీ కంపెనీ PJSC(TAQA) తన వ్యాపారాన్ని విస్తరించేందుకు గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీలో పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది.

అదానీ గ్రూప్ కంపెనీలు లేదా ఏదైనా ఒక సంస్థలో 1.5-2.5 బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంది. పైగా వ్యూహాత్మక భాగస్వామ్యంతో పాటు ఉత్తర ఆఫ్రికా, పశ్చిమాసియాలోని ప్రాజెక్టులపై కలిసి పనిచేయడానికి TAQA, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ మధ్య చక్కటి ట్యూనింగ్ ఉందని ఇరుపక్షాలు విశ్వసిస్తున్నాయి. ఈ క్రమంలోనే అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌లో TAQA దాదాపు 19.9 శాతం వాటాను సొంతం చేసుకోవాలనుకుంటోందని వెల్లడైంది. ప్రస్తుత ధర ప్రకారం రూ.821 చొప్పున.. మన కరెన్సీ ప్రకారం దీని విలువ అక్షరాలా రూ.18,240 కోట్లుగా ఉంది.

అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌ను గతంలో అదానీ ట్రాన్స్‌మిషన్ అని పిలిచేవారు. ఈ కంపెనీలో GQG భాగస్వాములు, దాని సహచరులు ఇప్పటికే దాదాపు 5.5% వాటాను కలిగి ఉన్నారు. TAQA విద్యుత్ ఉత్పత్తి, ట్రాన్స్‌మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆస్తులతో పాటు అప్‌స్ట్రీమ్- మిడ్‌స్ట్రీమ్ ఆయిల్ అండ్ గ్యాస్ కార్యకలాపాల్లో పెట్టుబడి పెడుతోంది. దీని ఆస్తులు UAE, సౌదీ అరేబియా, కెనడా, ఘనా, ఇండియా, ఇరాక్, మొరాకో, ఒమన్, నెదర్లాండ్స్, యూకే, అమెరికాల్లో విస్తరించి ఉన్నాయి.


Click it and Unblock the Notifications