Reliance News: ఇషా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ లోకి మరో సంస్థ పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైంది. ఇటీవలే మిస్టర్ కూల్, క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీని ప్రచారకర్తగా నియమించుకుని మంచి జోష్ మీదుంది. కాగా తాజాగా భారీ ఇన్వెస్ట్ మెంట్ ను ఆకర్షించి సత్తా చాటింది.
రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (RRVL)లో అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (ADIA) పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ పెట్టుబడి పెట్టనుంది. దాదాపు 4 వేల 967 కోట్లను ఇంజెక్ట్ చేయనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. ఈ డీల్ ద్వారా RRVL ప్రీ-మనీ ఈక్విటీ వాల్యూ 8.381 లక్షల కోట్లకు చేరనుంది. అలా చూస్తే దేశంలోని టాప్ 4 కంపెనీల్లో ఇదొకటిగా నిలుస్తుంది.

ఈ డీల్ ద్వారా RRVLలో ADIA 0.59 శాతం ఈక్విటీ వాటాదారుగా మారనున్నట్లు రిలయన్స్ రిటైల్ మీడియాకు తెలిపింది. 'ADIAతో మా సంబంధాన్ని బలోపేతం చేసుకోవడానికి సంతోషిస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా దశాబ్దాలకు పైగా సంపద సృష్టిలో వారికి సుదీర్ఘ అనుభవం ఉంది. అది మా విజన్ అమలుకు మరింత ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నాం' అని ఇషా అంబానీ పేర్కొన్నారు.
దేశంలో అతిపెద్ద, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రిటైల్ వ్యాపారాన్ని రిలయన్స్ రిటైల్ నిర్వహిస్తోంది. ఇప్పటికే కంపెనీకి 267 మిలియన్ల కస్టమర్‌లు ఉన్నారు. 18 వేల 500 షాప్స్, డిజిటల్ కామర్స్ ప్లాట్ ఫారమ్ లు, కిరాణా, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ఫార్మాస్యూటికల్స్ వంటి విభిన్న ఛానల్స్ లో సంస్థ తన సర్వీసులను అందిస్తోంది.


Click it and Unblock the Notifications