ఉద్యోగం చేయడం అనేది పురుష లక్షణం అంటుంటారు. దీంతో ఉద్యోగం దొరకబుచ్చుకోవడానికి పురుషులు చాలా కష్టపడుతుంటారు. ఇందులో భాగంగానే కాల్ చేసిన ప్రతి కంపెనీకి ఇంటర్వ్యూ హజరవుతుంటారు. అయితే చాలా కంపెనీలు ఇంటర్వ్యూ పూర్తి కాగానే తరువాత చెప్తాం అని దాటవేస్తుంటారు.
ఇక మరికొన్నికంపెనీలు అయితే వారంలో ఆఫర్ లెటర్ పంపిస్తామని చెబుతుంటాయి. ఇక మరి కొన్ని కంపెనీలు అయితే ఏకంగా ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తాయి కాని ఉద్యోగంలో చేరమని చెప్పవు. పాపం జాబ్ వచ్చిందనే ఆనందంలో ఉన్న వారికి కంపెనీ ఎప్పుడు పిలుస్తుందోనని ఎదురుచూస్తూ ఉంటారు. ఆఫర్ ఇచ్చినా జీతాలు ఊసే ఉండదు. అయితే ఇలాంటి అనుభవమే ఓ ఉద్యోగికి ఎదురయింది.. అతను ఏకంగా ఆ కంపెనీనే కోర్టుకి ఈడ్చాడు.
తాజా న్యూస్ ఏంటంటే.. ఉద్యోగంలో చేరకుండా నిరోధించిన ఉద్యోగికి రూ.26 లక్షలు చెల్లించాలని అబుదాబి సంస్థను అక్కడి కోర్టు ఆదేశించింది. అబుదాబిలోని ఒక కంపెనీ ఉద్యోగికి ఆఫర్ లెటర్ జారీ చేసింది. అయితే ఆ తర్వాత అతనికి ఎటువంటి పోస్ట్ ఇవ్వలేదు.

దీంతో ఆ ఉద్యోగి కోర్టు గడపతొక్కాడు. తన దగ్గర ఉన్న ఆధారాలతో కంపెనీపై దావా వేశాడు. ఇంకేముంది కోర్టు ఆఫర్ సమయంలో ఇచ్చిన జీతాన్నిమొత్తం ఇప్పటివరకు చెల్లించాలని కోర్టు ఆ సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అతగాడు ఉద్యోగంలో చేరకుండానే AED 110,400 (సుమారు రూ. 26 లక్షలు) జీతాన్ని అందుకున్నాడు.
ఖలీజ్ టైమ్స్‌లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం.. 2024 నవంబర్ 11న ఓ ఉద్యోగికి అబుదాబి కంపెనీ ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ లెటర్ విడుదల చేసింది.ఆ ఆఫర్ లెటర్ ప్రకారం.. ఉద్యోగితో ఆ కంపెనీ ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 7,200 దిర్హమ్‌ల బేసిక్ వేతనం, నెలకు 24,000 దిర్హమ్‌ల ప్యాకేజీ ఇస్తామని ఉద్యోగ కాంట్రాక్ట్ నిబంధనల్లో పేర్కొంది. ఆ తరువాత కంపెనీ అతని ప్రారంభ జాయినింగ్ తేదీని వాయిదా వేస్తూ వచ్చింది. అతను పనిలో చేరకుండా ఆలస్యం చేస్తూ వచ్చింది కంపెనీ.దీంతో ఆ బాధితుడు కంపెనీ ఆఫర్ లెటర్ ఇచ్చినా ఉద్యోగంలో చేర్చుకోలేదంటూ.. జీతాలను చెల్లించేలా ఆదేశించాలంటూ కోర్టు గడపతొక్కాడు.
సాక్ష్యాలను పరిశీలించిన తర్వాత.. కోర్టు ఉద్యోగికి అండగా నిలుస్తూ తీర్పును వెలువరించింది. తన తీర్పులో ఉద్యోగికి ఆఫర్ లెటర్ లో పొందుపరిచిన విధంగా జీతాలు చెల్లించాలని సంస్థను ఆదేశించింది. వేతన నివేదిక, ఎంప్లాయిమెంట్ కాంట్రాక్ట్, కేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా సమర్పించిన సపోర్టింగ్ డాక్యుమెంట్ల ఆధారంగా కోర్టు తీర్పును వెలువరించింది. ఉద్యోగి విధుల్లో చేరకుండా ఆలస్యం కావడానికి కారణం కంపెనీ యాజమాన్యమేనని కోర్టు గుర్తించింది. కార్మిక చట్టాల ప్రకారం టైం ప్రకారం వేతనాలు చెల్లించాల్సిన బాధ్యత యాజమాన్యాలపై ఉందని కోర్టు స్పష్టం చేసింది. బాధిత ఉద్యోగికి రూ.1,10,400 (సుమారు రూ.25 లక్షల వరకు) వేతనం చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది.
ఇక కంపెనీ కోర్టుకు మరో విధంగా వాదనలు వినిపించింది. డ్యూటీకి రిపోర్ట్ చేయలేదు..అనుమతి లేకుండా సెలవుపై వెళ్లాడని.. డ్యూటీకి హాజరు కాకపోవడం వల్ల అతను పూర్తి జీతానికి అర్హుడు కాదని కంపెనీ వాదించింది.అయితే ధర్మాసనం ఆధారాలను పరిశీలించి కంపెనీదే తప్పిదమని తేల్చి చెప్పింది. ఈ వివాదాస్పద కాలంలో ఎనిమిది రోజుల సెలవు తీసుకున్నానని ఉద్యోగి చెప్పడంతో ఆ రోజులకు జీతాన్ని మినహాయించాలని కోర్టు తీర్పును వెలువరించింది. మొత్తంగా 2024 నవంబర్ 11 నుంచి 2025 ఏప్రిల్ 7 వరకు AED 110,400 (సుమారు రూ. 26 లక్షలు) జీతాన్నిఉద్యోగికి ఇవ్వాలని కోర్టు తీర్పులో స్పష్టం చేసింది.


Click it and Unblock the Notifications