IPO News: తొలిరోజే బాక్సాఫీస్ బద్దలుకొట్టిన ఐపీవో.. ఇన్వెస్టర్ల డబ్బులు డబుల్..
ABS Marine services IPO: నేడు ఐపీవో మార్కెట్ ఫుల్ యాక్టివేట్ అయ్యింది. వరుసగా ఐపీవోలు దేశీయ మార్కెట్లలో నేడు లిస్టింగ్ కానుండటంతో ఇన్వెస్టర్లలో జోష్ కొనసాగుతోంది. ఎన్నికల అస్థిరతతో మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నప్పటికీ ఐపీవోల జోరు ఏమాత్రం తగ్గటం లేదు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది నేడు మార్కెట్లో జాబితా అవుతున్న ఏబీఎస్ మెరైన్ సర్వీసెస్ ఐపీవో గురించే. ఎస్ఎమ్ఈ కేటగిరీలో వచ్చిన చిన్న కంపెనీ బలమైన లిస్టింగ్ ద్వారా ఇన్వెస్టర్లకు ఊహించని లాభాలను తొలిరోజే అందించింది. ఐపీవోపై బెట్టింగ్ వేసిన ఇన్వెస్టర్లకు ABS మెరైన్ సర్వీసెస్ షేర్లు మొదటి రోజునే పెట్టుబడిని రెండింతలు చేశాయి. వాస్తవానికి ఐపీవో ఇష్యూ సమయంలో కంపెనీ షేర్ గరిష్ఠ ధర రూ.147గా ఉండగా.. లిస్టింగ్ సమయంలో 100 శాతం లాభంతో రూ.294 వద్ద నేడు మార్కెట్లో జాబితా అయ్యాయి.

ABS మెరైన్ సర్వీసెస్ ఐపీవో రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడి కోసం మే 10న ప్రారంభమై మే 15న ముగిసింది. బలమైన లిస్టింగ్ తర్వాత కంపెనీ షేర్లు ఇంట్రాడేలో పడిపోయి 5 శాతం లోయర్ సర్క్యూట్ ధర రూ.279.30ని తాకాయి. ఈ క్రమంలో స్టాక్ గరిష్ఠంగా రూ.304 స్థాయికి చేరుకున్నాయి. ఐపీవోకి ముందర కంపెనీలో ప్రమోటర్ల వాటా 86.50 శాతంగా ఉండగా.. ప్రస్తుతం అది 63.42 శాతానికి పరిమితమైంది. అక్టోబర్ 1992లో స్థాపించబడిన కంపెనీ ఆఫ్‌షోర్ నౌకలను నిర్వహిస్తుంది. డిసెంబర్ 31, 2023 నాటికి కంపెనీకి 5 నౌకలు ఉన్నాయి. కంపెనీ వ్యాపారం షిప్ యాజమాన్యం, షిప్ మేనేజ్‌మెంట్, మెరైన్ సర్వీసెస్, పోర్ట్ సర్వీసెస్ అనే నాలుగు విభాగాలుగా కొనసాగుతోంది.
ABS మెరైన్ సర్వీసెస్ ఐపీవో మెుత్తంగా 144.44 సార్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. ఈ క్రమంలో రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 110.24 రెట్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కేటగిరీలో వాటా 270.94 రెట్లు, క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ కొనుగోలుదారుల కోటా 109.30 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. ఇదే క్రమంలో పెట్టుబడిదారుల కోసం కంపెనీ లాట్ పరిమాణాన్ని 1000 షేర్లుగా నిర్ణయించగా.. దీనిలో పాల్గొనేందుకు వారు కనీసం రూ.1.47 లక్షలు ఇన్వెస్ట్ చేశారు. తాజాగా ఎన్ఎస్ఈ ఎస్ఎమ్ఈ ఐపీవో కంపెనీ మార్కెట్ల నుంచి రూ.96.29 కోట్లను విజయవంతంగా సమీకరించింది.


Click it and Unblock the Notifications