Aadhar card: ఆధార్ కార్డు కొత్త లుక్! ఫోటో, QR కోడ్ మాత్రమే ఉంటాయా? క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం!
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఆధార్ కార్డ్ (Aadhar card) గురించి ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. ప్రభుత్వం ఆధార్ కార్డు రూపురేఖలను పూర్తిగా మార్చేస్తోందని, ఇకపై వచ్చే కొత్త కార్డులపై పేరు, అడ్రస్ ఉండవని.. కేవలం ఫోటో, QR కోడ్ మాత్రమే ఉంటాయని ఆ వార్తల సారాంశం. డేటా లీక్ అవ్వకుండా, ఐడెంటిటీ దొంగతనం జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారని చాలామంది నమ్మారు. అయితే, ఈ ప్రచారంలో ఎంత నిజం ఉందో ప్రభుత్వం స్పష్టం చేసింది.

కేంద్ర ప్రభుత్వం ఏమందంటే?
ఆధార్ కార్డుపై వైరల్ అవుతున్న ఈ వార్తలన్నీ అవాస్తవమని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ప్రజలను అయోమయానికి గురిచేయడానికే ఇటువంటి తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని ఐటీ మంత్రిత్వ శాఖ మండిపడింది. ఆధార్ కార్డులో ప్రస్తుతానికి ఎటువంటి మార్పులు లేవని, సోషల్ మీడియాలో వచ్చే గాలి వార్తలను నమ్మవద్దని ప్రజలను కోరింది. ఏదైనా సమాచారం కావాలంటే UIDAI అధికారిక వెబ్ సైట్ లేదా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ప్రకటనలను మాత్రమే చూడాలని సూచించింది.
ఆధార్ కార్డులో ఏముంటాయి?
సాధారణంగా ఒక ఆధార్ కార్డ్ (Aadhar card) పై యూజర్ ఫోటోతో పాటు పేరు, పుట్టిన తేదీ (DOB), అడ్రస్ , 12 అంకెల ఆధార్ నంబర్ ఉంటాయి. కార్డు వెనుక భాగంలో ఉన్న QR కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా యూజర్ వివరాలను అథెంటికేట్ చేయవచ్చు. ప్రస్తుతం ఉన్న ఈ పద్ధతిలో ప్రభుత్వం ఎటువంటి మార్పులు చేయలేదు. కాబట్టి మీ పాత కార్డు మార్చుకోవాలని లేదా వివరాలు ఉండవని వచ్చే పోస్టులను చూసి టెన్షన్ పడకండి.
ఆధార్‌పై మరో కీలక వివరణ: ఇది డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కాదు!
ఇదే సమయంలో UIDAI మరొక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేసింది. చాలామంది ఆధార్ కార్డును పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం (Proof of Date of Birth) గా వాడుతుంటారు. కానీ, ఆధార్ కేవలం 'గుర్తింపు కార్డు' (Proof of Identity) మాత్రమేనని, ఇది పుట్టిన తేదీని ధృవీకరించడానికి పనికిరాదని UIDAI స్పష్టం చేసింది. ఆధార్ చట్టం-2016 ప్రకారం ఆధార్ కార్డును ఐడెంటిటీ ప్రూఫ్‌గా ఉపయోగించవచ్చు కానీ, దాన్ని డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్‌గా పరిగణించకూడదని పేర్కొంది.
ప్రజలకు సూచన
ఆధార్ కార్డుకు సంబంధించి ఎటువంటి అప్‌డేట్స్ ఉన్నా UIDAI ఎప్పటికప్పుడు తన 'X' (గతంలో ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేస్తుంది. ఫ్యాక్ట్ చెక్ చేయకుండా వాట్సాప్‌లో వచ్చే వార్తలను ఇతరులకు ఫార్వార్డ్ చేయవద్దు. మీ వ్యక్తిగత సమాచారం భద్రంగా ఉండాలంటే అనధికారిక వెబ్ సైట్లలో ఆధార్ వివరాలను ఎంటర్ చేయకండి. అలాగే మీ ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోవాలన్నా లేదా ఏదైనా సందేహం ఉన్నా నేరుగా సమీపంలోని అధికారిక ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లడం లేదా UIDAI వెబ్‌సైట్‌ను సందర్శించడం ఉత్తమమైన మార్గం. గుర్తుంచుకోండి, ఆధార్ అనేది కేవలం మీ వ్యక్తిగత గుర్తింపును ధృవీకరించడానికి మాత్రమే, అది అన్ని సందర్భాల్లోనూ పుట్టిన తేదీకి ఆధారంగా పనిచేయదు. ఈ విషయంలో స్పష్టత కలిగి ఉండటం వల్ల భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవచ్చు.


Click it and Unblock the Notifications