జీఎస్టీ రీఫండ్ క్లెయిమ్స్‌కు ఆధార్ ధృవీకరణ తప్పనిసరి
పన్ను చెల్లింపుదార్లు జీఎస్టీ రిఫండ్స్‌ను క్లెయిమ్ చేసుకోవడానికి ఆధార్ ధ్రువీకరణను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. జీఎస్టీ రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన పాన్ నెంబర్‌కు అనుసంధానమైన బ్యాంకు ఖాతాల్లోనే జీఎస్టీ రీఫండ్స్ వేసేలా చర్యలు చేపట్టింది. పన్ను ఎగవేతల నియంత్రణలో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకుంది. ఇందుకుగాను జీఎస్టీకి సంబంధించి వివిధ నిబంధనల్లో కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డ్ (CBIC) సవరణలు చేసింది.
సెప్టెంబర్ 17వ తేదీన జరిగిన జీఎస్టీ మండలి భేటీలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా CBIC నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అలాగే వ్యాపారులు జీఎస్టీ వివరాలు సమర్పించే జీఎస్టీఆర్-3బీ రిటర్న్ దాఖలు చేయడాన్ని ఒక్క నెల ఆపివేసినా, ఆ తదుపరి నెలకు జీఎస్టీఆర్-1 విక్రయాల రిటర్న్ దాఖలు చేసే వీలుండదని కూడా తెలిపింది.

జీఎస్టీ వివరాలు సమర్పించే జీఎస్టీఆర్-3B రిటర్న్ దాఖలు చేయడాన్ని ఒక్క నెల ఆపినా ఆ తదుపరి నెలకు జీఎస్టీఆర్-1 విక్రయాల రిటర్న్స్‌ను దాఖలు చేసే వీలు ఉండదు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుండి దీనిని అమలు చేయనున్నారు. ప్రస్తుతం జీఎస్టీఆర్-3Bని 2 నెలల పాటు దాఖలు చేయకుంటే జీఎస్టీఆర్-1ను సమర్పించడానికి వీలులేదు.
వచ్చే ఏడాది నుండి దీనిని ఒక నెలకు తగ్గిస్తున్నారు. ఇందుకు కేంద్ర జీఎస్టీ నిబంధనల్లోని 59(6)ను సవరణ చేస్తున్నారు. ఒక నెలలో చేసిన విక్రయాల వివరాలతో జీఎస్టీఆర్-1ను మరుసటి నెల 11వ తేదీ వరకు వ్యాపారులు దాఖలు చేస్తారు. జీఎస్టీ వివరాలతో జీఎస్టీఆర్-3Bని మరుసటి నెల 20 రోజుల నుండి 24 రోజుల మధ్య సమర్పించి, జీఎస్టీని చెల్లిస్తారు.


Click it and Unblock the Notifications