Telangana: గుడ్ న్యూస్.. తెలంగాణలో అందుబాటులోకి ఆరు లైన్ల రహదారి..
తెలంగాణలో మరో జాతీయ రహదారి అందుబాటులోకి వచ్చింది. కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారి(NH563)లో అధికారికంగా ప్రయాణాలు సాగించనున్నారు. ఈ మేరకు భారత జాతీయ రహదారుల సంస్థ(ఎన్ హెచ్ఏఐ) అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రహదారిపై సెప్టెంబర్ 5 నుంచి ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ట్రయల్ రన్ విజయవంతం కావడంతో అధికారికంగా రోడ్డును ప్రారంభించనున్నారు. రూ.1,641కోట్ల వ్యయంతో 68.015 కిలోమీటర్ల మేర నాలుగు వరుసలుగా నిర్మించిన జాతీయ రహదారిపై ప్రయాణాలు సాఫిగా సాగనున్నాయి. కేంద్ర ప్రభు త్వం భారతమాల పరియోజన పథకం కింద రూ. 2,146.86కోట్ల నిధులు కేటాయించింది. భూసేకరణ, చెట్ల తొలగింపు, విద్యుత్ స్తంభాల మార్పిడి తదితర వాటికి రూ.505.86కోట్లు కేటాయించగా, మరో రూ. 1,641కోట్లతో 68.015 కిలో మీటర్ల పరిధిలో ఎన్ హెచ్-563 రహదారిని నిర్మించారు. ఈ హైవే కరీంనగర్ జిల్లా పరిధిలో 46.24 కిలో మీటర్లు, హనుమ కొండ జిల్లా పరిధిలో 21.77కి.మీలు విస్తరించింది.
అత్యాధునిక ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ, సీసీ కెమెరాలు, సోలార్ హైమాస్ట్ లైటింగ్, మెరుగైన జంక్షన్లు, భద్రతా ప్రమాణాలతో రూపొం దించిన ఈ హైవే కరీంనగర్, వరంగల్ ప్రజలకు అధికారికంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో వరంగల్- కరీంనగర్ మధ్య ప్రయాణ సమయం దాదాపు సగానికి తగ్గడమే కాకుండా, ఉత్తర తెలంగాణలో రవాణా, వాణిజ్య, పారిశ్రామిక కార్యకలాపాలకు ఉపయోగపడనుంది. కాగా ఈ హై వేపై టోల్ వసూలు చేయనున్నారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు వద్ద ఏర్పాటు చేసిన ఈ టోల్ ప్లాజాలో గురువారం ఉదయం 8 గంటల నుంచి టోల్ ట్యాక్స్ వసూలు ప్రారంభించారు.

ఆర్టీసీ బస్సులపై టోల్ విధించడంతో ఒక్కో బస్సు టికెట్ పై రూ.10 అదనంగా చార్జీ పెంచే అవకాశం ఉంది. కార్లు, జీపులు, వ్యాన్లు లేదా లైట్ మోటార్ వాహనాలకు(ఎల్ఎంవీ) వన్ సైడ్ జర్నీకి రూ.160, అదే రోజు తిరుగు ప్రయాణానికి రూ. 235 చొప్పున ఫీజు నిర్ణయించారు. ఈ తరహా వెహికల్స్ కు నెలకు 50 ప్రయాణాల కోసం జారీ చేసే నెలవారీ పాస్ ధర రూ. 5,250గా తీసుకోనున్నారు. కరీంనగర్ జిల్లా పరిధిలో నమోదైన కమర్షియల్ వెహికల్స్(టీఎస్02)కు రూ.80గా నిశ్చయించారు. లైట్ కమర్షియల్ వెహికల్స్, మినీ బస్సులకు సింగిల్ జర్నీకి రూ. 255, రిటర్న్ జర్నీకి రూ. 380, నెలవారీ పాస్కు రూ. 8,485, జిల్లా కమర్షియల్ వాహనాలకు రూ.125 వసూలు చేస్తారు.
ఈ కొత్త నాలుగు లైన్ల రహదారిపై వరంగల్ నుంచి కరీంనగర్కు గంటన్నర చేసే ప్రయాణం కేవలం 45 నిమిషాల్లో వెళ్లే అవకాశం ఉంది. ఈ హైవేను హనుమకొండ జిల్లా పలివేల్పుల సమీపంలోని హైదరాబాద్- భూపాలపట్నం జాతీయ రహదారి 163 వద్ద ప్రారంభమై గుంటూరుపల్లి, ఎర్రగట్టు గుట్ట, హసన్పర్తి, ఎల్లాపూర్, ఎల్కతుర్తి, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్, కేశవ పట్నం మీదుగా మానుకొండూరు బైపాస్ వర కు నిర్మించారు. ఈ రహదారీలో భాగంగా కరీంనగర్ నుంచి జగిత్యాల వరకు రోడ్డు నిర్మించాల్సి ఉంది.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications