మరో పక్షం రోజుల్లో హైదరాబాద్‌లో రూ.120కి పెట్రోల్?
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే వివిధ దేశాల్లో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పాకిస్తాన్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.160కి చేరుకుంది. శ్రీలంకలో అయితే లీటర్ వారి కరెన్సీలో 207కు చేరుకుంది. మన దేశంలో ఎన్నికల కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు గత నాలుగు నెలలుగా పెరగలేదు. ఎన్నికల అనంతరం ధరలు పెరుగుతాయి.
అంతర్జాతీయ మార్కెట్‌లో నాలుగు నెలలకు ముందు చమురు ధరలు బ్యారెల్‌కు 70 డాలర్ల వద్ద ఉంది. అప్పటి నుండి మన వద్ద ధరలు పెరగలేదు. కానీ ఇప్పుడు బ్యారెల్ చమురు ధర 110 డాలర్లకు పైన ఉంది. అంటే ఈ నాలుగు నెలల కాలంలో బ్యారెల్‌కు యాభై శాతం మేర పెరిగాయి. దీంతో మన వద్ద ధరలు ఎంత పెరుగుతాయనే ఆందోళన నెలకొంది.

మన వద్ద లీటర్ పెట్రోల్, డీజిల్ పైన లీటర్‌కు రూ.12 వరకు పెరిగే అవకాశముంది. ఈ పెంపు కూడా ఒకేసారి ఉండదని తెలుస్తోంది. దశలవారీగా ఈ పెంపు ఉండాలని చమురురంగ సంస్థలకు ప్రభుత్వం సూచించినట్లుగా సమాచారం. మార్చి 7వ తేదీన చివరి విడత ఎన్నికలు పూర్తి కానున్నాయి. మార్చి 10న ఫలితాలు వస్తాయి. ఇదే కాలంలో ధరల పెరుగుదల ప్రారంభమై, మార్చి 16వ తేదీ నాటికి పెట్రోల్, డీజిల్ పైన రూ.12 పెంచవలసి వస్తుందని పేర్కొంటున్నారు.
అంటే పది రోజుల కాలంలో రూ.12 అంటే సగటున ఒకరోజుకు రూ.1కి పైగా పెంచవచ్చు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇలాగే కొనసాగితే చమురు ధరలు 120 డాలర్లకు చేరుకుంటే మరింత వేగంగా, ఎక్కువగా పెరగవచ్చు. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.95.41, డీజిల్ రూ.86.67గా ఉంది. దీపావళికి కేంద్రం పెట్రోల్ పైన రూ.10, డీజిల్ పైన రూ.5 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ఇతర రాష్ట్రాల్లోను ఆ రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గించనందున పెట్రోల్ రూ.100కు పైనే ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.108.20 వద్ద ఉంది. మార్చి 16వ తేదీ నాటికి రూ.12 పెరిగితే అప్పుడు రూ.120 క్రాస్ చేస్తుంది. డీజిల్ రూ.94.62గా ఉంది. హైదరాబాద్‌లో వచ్చే 16వ తేదీ నాటికి డీజిల్ ధర రూ.107కు చేరుకోవచ్చు.


Click it and Unblock the Notifications