Bengaluru: ట్యాప్ వాటర్ తో కాళ్లు కడగొద్దన్నందుకు పీజీ యజమాని ప్రాణాలు తీశారు..
చిన్నపాటి నీటి గొడవ ఒకరి ప్రాణాలు తీసింది. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. తూర్పు బెంగళూరులో సోమవారం సాయంత్రం ఓ వసతి గృహంలో ఒక పెయింగ్ గెస్ట్ కుళాయి నీటితో కాళ్లు కడుక్కోవడంపై విద్యార్థులకు, హాస్టల్ యజమానికి మధ్య జరిగిన వివాదంతో మొదలైన ఘర్షణ ఓనర్ మృతికి కారణమైంది. లక్ష్మీ నరసింహ, మాధవ్ మట్లే కలిసి కస్తూరినగర్ మెయిన్ రోడ్ సమీపంలో హాస్టల్ నిర్వహిస్తున్నారు. అయితే సిటీలో నీటి సమస్యతో ట్యాంకర్లతో నీటిని తెప్పించుకుంటున్నారు. ఈ క్రమంలోనే గొడవ జరిగింది.
21 ఏళ్ల రాకేశ్ బికామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. 20 ఏళ్ల డాన్ బ్రిట్ సన్ బీబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నారు. వీరిద్దరు లక్ష్మీ నరసింహ, మాధవ్ మట్లే కలిసి నిర్వహిస్తున్న హాస్టల్ లో ఉంటున్నారు. వీరిద్దరు సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి 6 గంటల 30 నిమిషాల మధ్య పీజీకి వచ్చారు. వీరు హాస్టల్ ఆవరణలోకి వచ్చి ట్యాప్ వాటర్ తో కాళ్లు కడుక్కున్నారు. ఇది గమనించిన మట్లే అభ్యంతరం వ్యక్తం చేశాడు. వీరి మధ్య మాటమాటా పెరిగింది. మట్లేను విద్యార్థులు దూషింటారు. దీంతో ఆగ్రహానికి గురైన అతను విద్యార్థులను కొట్టడానికి క్రికెట్ బ్యాట్ తీసుకొచ్చాడు.

బ్యాట్ తో విద్యార్థులను కొట్టే ప్రయత్నం చేయగా.. విద్యార్థులు ఆ బ్యాట్ లాక్కొని మట్లేపై దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే మట్లే అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. నిందితులు రాకేశ్, డాన్ బ్రిట్ సన్ ను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 103 (హత్యకు శిక్ష) కింద హత్య కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీస్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ విక్రమ్ అమతే తెలిపారు. వారిని విచారిస్తున్నట్లు చెప్పారు. నిందితులు ఇద్దరు కాళ్లు కడుక్కోవడానికి వెళ్లే ముందు ఆ ఇద్దరూ హాస్టల్ సమీపంలో మద్యం తాగినట్లు వార్తలు వస్తున్నాయి.
కాగా బెంగళూరులో నీటి సమస్య ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో హాస్టల్ నిర్వాహకులు డబ్బులు చెల్లించి ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేస్తున్నారు. అందుకే నీటి పొదుపుగా వాడుతున్నారు. ఈ నేపథ్యంలో హాస్టల్ ఓనర్ నీటి వృథా చేయవద్దని అన్నందుకు ప్రాణాలు కోల్పోయాడు. కాగా ఈ ఘటన బెంగళూరులో చర్చనీయాంశంగా మారింది.


Click it and Unblock the Notifications