Flight Missing: పాకిస్థాన్‌లో విమానం మిస్సింగ్.. గాలింపు చర్యలు ప్రారంభం..!
పాకిస్థాన్ గగనతలంలో ఓ కార్గో విమానం మిస్ అయింది. దీంతో ఆ విమానం ఎక్కడ ఉందోనని వెతుకుతున్నారు. అరేబియా సముద్రంపై గల్లంతైన బోయింగ్ కార్గో విమానం కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ విమానంలో ఐదుగురు సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం 6 గంటల 18 నిమిషాలకు పాకిస్తాన్ విమానయాన సంస్థకు చెందిన బోయింగ్ 737-400 విమానం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని షార్జా నుంచి కరాచీకి బయల్దేరింది. రాత్రి 9 గంటల సమయంలో విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు సమాచారం వచ్చిందని పాకిస్థాన్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ అధికారులు తెలిపారు.
మంగళవారం రాత్రి 9:18 గంటల ప్రాంతంలో విమానం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు కోల్పోయిందని వివరించింది. కొన్ని నిమిషాల తర్వాత, ప్రపంచవ్యాప్త ఫ్లైట్-ట్రాకింగ్ సర్వీస్ నుంచి కనిపించకుండా పోయిందన్నారు. ఫ్లైట్‌రాడార్24 డేటా ప్రకారం ఆ విమానం ఒక నిమిషం లోపే దాదాపు 1,525 మీటర్ల (5,000 అడుగుల) కిందికి వచ్చినట్లు చెబుతున్నారు. ఆ తర్వాత 30 సెకన్లలో సుమారు 1,830 మీటర్ల (6,000 అడుగుల) ఎత్తుకు వెళ్లిందని... అనంతరం, 11,140 మీటర్ల (36,550 అడుగుల) ఎత్తు నుంచి దాదాపు నిలువుగా కిందికి దిగడం ప్రారంభించిందని పాకిస్థాన్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ అధికారులు పేర్కొన్నారు.

అది నిమిషానికి 22,400 అడుగులు లేదా గంటకు సుమారు 400 కిలోమీటర్ల వేగంతో కిందికి దిగుతూ, 335 మీటర్ల (1,100 అడుగుల) ఎత్తులో ఉనప్పుడు ఏటీసీతో సంబంధాలు తెగిపోయినట్లు వివరించారు. కరాచీకి పశ్చిమంగా సుమారు 155 నాటికల్ మైళ్ల (287 కిలోమీటర్లు లేదా 178 మైళ్లు) దూరంలో దానితో అన్ని సంబంధాలు తెగిపోయాయని తెలిపారు. పాకిస్తానీ నావికాదళ నౌక, పాకిస్తాన్ నేషనల్ షిప్పింగ్ కార్పొరేషన్ నడుపుతున్న ఒక వాణిజ్య నౌక, రెండు నావికాదళ విమానాలు గాలింపు చేపట్టాయి.
బలోచిస్థాన్‌లోని ఒర్మారా సమీపంలో అరేబియా సముద్రంపై ప్రయాణిస్తున్నప్పుడు విమానం అదృశ్యమైనట్లు తెలిపారు. ఇప్పటివరకు ఎలాంటి విమాన శకలాలు గానీ, ప్రాణాలతో ఉన్నవారు గానీ లభించలేదు.కే2 ఎయిర్‌వేస్ విమాన సముదాయంలో ఉన్న ఏకైక విమానం ఇదే. ఒకవేళ ప్రమాదం జరిగితే, 2020 మే నెలలో కరాచీలో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ విమానం రన్‌వేకు కొద్ది దూరంలో కూలిపోయి, విమానంలో ఉన్న 99 మందిలో 97 మంది మరణించిన ఘటన తర్వాత, పాకిస్తాన్‌లో ఇదే మొట్టమొదటి ప్రధాన పౌర విమాన ప్రమాదం కానుంది.


Click it and Unblock the Notifications