కొత్త ఏడాది ఉద్యోగులకు గుడ్ న్యూస్..భారీగా జీతాల పెంపు.. 8th Pay Commission సిఫార్సులో ఏముందంటే..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన 8వ వేతన సంఘం (8th Pay Commission)పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా జీతాల పెంపు, భత్యాల సవరణ, పెన్షన్ల మెరుగుదల విషయంలో వేతన సంఘం కీలక నిర్ణయాలు తీసుకోబోతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. 7వ వేతన సంఘం పదవీకాలం ఈ నెల 31తో ముగియనుండటంతో..కొత్త వేతన సంఘం అమలుపై ఉద్యోగుల్లో ఉత్కంఠ పెరిగింది.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గత నెలలోనే అధికారికంగా 8వ వేతన సంఘాన్ని నియమించింది. ఈ కమిషన్‌కు తన సిఫార్సులను సిద్ధం చేసేందుకు 18 నెలల గడువు ఇచ్చింది. అంటే 2027 మధ్య నాటికి పూర్తి నివేదిక కేంద్రానికి అందే అవకాశం ఉంది. అయితే లెక్కల ప్రకారం ఈ కమిషన్ అమలు తేదీని జనవరి 1, 2026గా పరిగణించనున్నారు. అంటే నివేదిక ఆలస్యంగా వచ్చినా.. పెరిగిన జీతాలు, భత్యాలు ఆ తేదీ నుంచే బకాయిలతో సహా ఉద్యోగులకు చెల్లించే అవకాశముంది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. 8వ వేతన సంఘం 20 నుంచి 35 శాతం వరకు జీతాల పెంపును సిఫార్సు చేయవచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ పెంపు ఉద్యోగుల పే స్కేలు, గ్రేడ్ పే, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, డియర్‌నెస్ అలవెన్స్ (DA) విలీనం వంటి అంశాలపై ఆధారపడి మారవచ్చు. ముఖ్యంగా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెంపుపై ఉద్యోగ సంఘాలు పెద్దగా ఆశలు పెట్టుకున్నాయి. 7వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57గా ఉండగా.. 8వ వేతన సంఘంలో దీన్ని మరింత పెంచాలని డిమాండ్లు ఉన్నాయి.
కేంద్రం నియమించిన 8వ వేతన సంఘం ఇప్పటికే ఉద్యోగుల జీతాలు, భత్యాలు, పెన్షన్లపై లోతైన అధ్యయనం ప్రారంభించింది. ప్రస్తుత ద్రవ్యోల్బణం, జీవన వ్యయం, మార్కెట్ ధరలు, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని సిఫార్సులు రూపొందించనుంది. ముఖ్యంగా దిగువ స్థాయి ఉద్యోగులకు ఎక్కువ లాభం చేకూర్చేలా కనీస వేతనాన్ని పెంచే అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు సమాచారం.
ఇక అమలు విషయంలో చూస్తే.. 8వ వేతన సంఘం 2026 జనవరి 1 నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. కమిషన్ నివేదికను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన తర్వాత, కొత్త ఆర్థిక సంవత్సరంలో ఏదో ఒక సమయంలో పెరిగిన జీతాలు ఉద్యోగుల ఖాతాల్లో జమయ్యే అవకాశం ఉంది. అయితే ఎప్పుడు జమ చేసినా జనవరి 1, 2026 నుంచి బకాయిలతో కలిపే చెల్లింపులు జరగనున్నాయని అంచనా. దీని వల్ల ఉద్యోగులకు ఆర్థికంగా పెద్ద ఊరట లభించనుంది.ఏదేమైనా 8వ వేతన సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గణనీయమైన జీతాల పెంపు, మెరుగైన భత్యాలు, పెన్షనర్లకు ప్రయోజనాలు తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications