8వ వేతన సంఘం లేటెస్ట్ అప్‌డేట్.. చివరి జీతంలో 67 శాతం పెన్షన్ కావాలి.. పెన్షనర్లు ఇతర కీలక ప్రతిపాదనలు..
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల వేతన, పదవీ విరమణ ప్రయోజనాల నిర్మాణంలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు ఏర్పాటైన 8వ వేతన సంఘం (8th Pay Commission) ముందు పింఛనుదారుల సంఘాలు కీలక డిమాండ్లను ఉంచుతున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వైద్య, జీవన వ్యయాలను తట్టుకునేందుకు పదవీ విరమణ ప్రయోజనాలను గణనీయంగా పెంచాలని కోరుతూ భారత్ పెన్షనర్స్ సమాజ్ (BPS) కమిషన్‌కు సమగ్ర వినతిపత్రం సమర్పించింది.
జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలో 2025 నవంబర్ 3న ఏర్పాటైన త్రిసభ్య కమిషన్, 2027 మే-జూన్ నాటికి తన తుది నివేదికను కేంద్రానికి సమర్పించనుంది. ఇందులో భాగంగా ప్యానెల్ ఇటీవల అక్టోబర్ 8న బెంగళూరులో, అక్టోబర్ 23న ముంబైలో ఉద్యోగ, పింఛనుదారుల సంఘాలతో సంప్రదింపుల సమావేశాలు నిర్వహించింది. భారత్ పెన్షనర్స్ సమాజ్ ప్రధానంగా మూడు కీలక సిఫార్సులను కమిషన్ ముందుంచింది.

ఉద్యోగి చివరిగా పొందిన మూల వేతనంలో (Last Drawn Basic Pay) సాధారణ పింఛను రేటును ప్రస్తుతమున్న 50 శాతం నుండి 67 శాతానికి పెంచడం, కనీస నెలసరి పింఛనును రూ. 45,000గా నిర్ణయించడం, కుటుంబ పింఛనును చివరి మూల వేతనంలో 30 శాతం నుండి 50 శాతానికి పెంచడం. గతంలో 7వ వేతన సంఘం సమయంలోనూ ఇటువంటి డిమాండ్లు వచ్చినప్పటికీ, 6వ వేతన సంఘం అప్పటికే 33 సంవత్సరాల అర్హత సర్వీసు నిబంధనను తొలగించి పింఛను లెక్కింపును సరళతరం చేసిందని.. వేతన సవరణ జరిగినప్పుడల్లా పింఛను కూడా ఆటోమేటిక్‌గా పెరుగుతుందని పేర్కొంటూ 7వ కమిషన్ ఆ ప్రతిపాదనలను తిరస్కరించింది.
ఒకవేళ 8వ వేతన సంఘం ఈ 67 శాతం పింఛను ప్రతిపాదనకు ఆమోదం తెలిపితే, పదవీ విరమణ చేసిన ఉద్యోగుల నెలవారీ ఆదాయంలో భారీ మార్పు రానుంది. ఉదాహరణకు, 7వ వేతన సంఘం పే-మ్యాట్రిక్స్ లెవెల్-6 ప్రకారం రూ. 44,900 చివరి మూల వేతనంతో పదవీ విరమణ చేసే ఉద్యోగికి ప్రస్తుతం 50 శాతం చొప్పున నెలకు రూ. 22,450 ప్రాథమిక పింఛను లభిస్తోంది. ఇది 67 శాతానికి పెరిగితే నెలవారీ పింఛను రూ. 30,083కి (నెలకు రూ. 7,633 అదనం, ఏడాదికి రూ. 91,596 పెరుగుదల) చేరుతుంది.
అలాగే, చివరి మూల వేతనం రూ. 18,000 ఉన్నవారికి నెలకు అదనంగా రూ. 3,060, రూ. 78,800 ఉన్నవారికి నెలకు రూ. 13,396 చొప్పున ప్రయోజనం కలుగుతుంది. అయితే, తక్కువ మూల వేతనంతో రిటైర్ అయ్యే వారికి కేవలం శాతం పెంపు వల్ల తగినంత ఆర్థిక భరోసా లభించదనే ఉద్దేశంతోనే బీపీఎస్ కనీస పింఛను రూ. 45,000 ఉండాలని కోరుతోంది.
కుటుంబ పింఛను విషయానికొస్తే.. రూ. 44,900 మూల వేతనం కలిగిన ఉద్యోగి కుటుంబానికి ప్రస్తుతం 30 శాతం చొప్పున నెలకు రూ. 13,470 అందుతుండగా, 50 శాతం ప్రతిపాదన ఆమోదం పొందితే అది రూ. 22,450కి (నెలకు రూ. 8,980 అదనం) పెరుగుతుంది. అయితే, పింఛను శాతం పెరిగినంత మాత్రాన పదవీ విరమణ గ్రాట్యుటీ దానంతట అదే పెరగదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గ్రాట్యుటీని పింఛనుతో సంబంధం లేకుండా ఉద్యోగి మొత్తం వేతనాలు (మూల వేతనం + కరువు భత్యం), అర్హత సర్వీసు ఆధారంగా లెక్కిస్తారు.
ప్రస్తుతం గరిష్ఠ గ్రాట్యుటీ పరిమితి రూ. 25 లక్షలుగా ఉంది. 33 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న రూ. 44,900 మూల వేతనం, 63 శాతం డీఏ కలిగిన ఉద్యోగికి 16.5 రెట్ల సూత్రం ప్రకారం సుమారు రూ. 12.08 లక్షల గ్రాట్యుటీ లభిస్తుంది. ఇది పెరగాలంటే వేతన పట్టికలో లేదా గ్రాట్యుటీ నిబంధనల్లో ప్రత్యేక సవరణ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఇవన్నీ పింఛనుదారుల సంఘాలు సమర్పించిన ప్రతిపాదనలు మాత్రమే కాగా.. తుది నిర్ణయం 8వ వేతన సంఘం సిఫార్సులు, కేంద్ర ప్రభుత్వ ఆమోదంపైనే ఆధారపడి ఉంటుంది.


Click it and Unblock the Notifications
