కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా డీఏ.. రాష్ట్ర ప్రభుత్వ కొత్త ప్లాన్ ఇదే!
కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జీతాలు, అలవెన్సులు , వేతన సంఘం పరిణామాల పరంగా ఈ వారం చాలా కీలకమైన అప్‌డేట్స్ వచ్చాయి. ఒకవైపు దేశవ్యాప్తంగా 8వ వేతన సంఘం (8th Pay Commission) కింద మెమొరాండం సమర్పించే గడువును జూన్ 15 వరకు పొడిగించగా.. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్ (DA) బకాయిలపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తామని పశ్చిమ బెంగాల్ కొత్త ప్రభుత్వం ప్రకటించింది.

సుప్రీంకోర్టు ఆదేశాల అమలు.. 25% బకాయిలు వెంటనే!
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి , ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ స్ట్రగుల్ ఫోరమ్ ప్రతినిధుల మధ్య సెక్రటేరియట్‌లో దాదాపు గంటన్నర పాటు సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో.. 2008 నుండి 2019 మధ్య కాలానికి సంబంధించిన డీఏ బకాయిలను ఉద్యోగులకు చెల్లించాలంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పూర్తిగా అమలు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. కోర్టు ఆదేశాల ప్రకారం మొదటి విడతగా 25 శాతం బకాయిలను వెంటనే చెల్లించేందుకు ప్రక్రియను ప్రారంభించాల్సిందిగా చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీలను సీఎం ఆదేశించారు.
కేంద్రంతో ఉన్న 42% డీఏ గ్యాప్ తగ్గుతుందా?
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బేసిక్ పే లో 60 శాతం డీఏ అందుతుండగా, బెంగాల్ రాష్ట్ర ఉద్యోగులకు కేవలం 18 శాతం మాత్రమే వస్తోంది. అంటే కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య ఏకంగా 42 శాతం వ్యత్యాసం ఉంది. ఈ గ్యాప్‌ను దశలవారీగా తగ్గిస్తామని, జూన్ 22న ప్రవేశపెట్టబోయే రాష్ట్ర బడ్జెట్‌లో దీనిపై ఒక పెద్ద ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాల నేత భాస్కర్ ఘోష్ తెలిపారు. అంతేకాదు, వచ్చే ఏడాది జనవరి నాటికి 7వ వేతన సంఘం సిఫార్సులను కూడా అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
7వ వేతన సంఘం ఏర్పాటు.. జీతాల పెంపు!
ఇటీవలే మే నెలలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తమ సొంత '7వ రాష్ట్ర వేతన సంఘం' ఏర్పాటుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈ కమిషన్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మున్సిపల్ సిబ్బంది , ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థల సిబ్బంది అందరికీ జీతాలు, డీఏల పెంపుదలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
డిసెంబర్ లోపు 50 వేల ఉద్యోగాల భర్తీ!
నిరుద్యోగులకు కూడా ఈ సమావేశం ద్వారా ఒక గుడ్ న్యూస్ అందింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి జూన్ 7 లోగా ఒక కొత్త పాలసీని తీసుకురాబోతున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి కనీసం 50,000 కొత్త ఉద్యోగ నియామకాలు చేపడతామని ముఖ్యమంత్రి స్వయంగా హామీ ఇచ్చారు.
మొత్తానికి 8వ వేతన సంఘం (8th Pay Commission) పనులు ఊపందుకుంటున్న తరుణంలో.. రాష్ట్రాల స్థాయిలో కూడా ఉద్యోగుల జీతాలు, అలవెన్సుల పెంపుపై సానుకూల నిర్ణయాలు రావడం ఉద్యోగ వర్గాల్లో పెద్ద ఊరటనిస్తోంది.


Click it and Unblock the Notifications