కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 8th Pay Commission (ఎనిమిదో పే కమిషన్) ప్రక్రియ వేగవంతమైంది. ఫిబ్రవరి 25, 2026న న్యూఢిల్లీలో జరిగిన 'నేషనల్ కౌన్సిల్ జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ' (NC-JCM) సమావేశంలో ఉద్యోగుల భవిష్యత్తును మార్చేసే పలు కీలక అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. రైల్వే, డిఫెన్స్, పోస్టల్, ఇన్‌కమ్ టాక్స్ వంటి ప్రధాన విభాగాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని తమ గళాన్ని వినిపించారు.

ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు: 5 ప్రమోషన్లు గ్యారెంటీ!
చాలా కాలంగా జూనియర్ స్థాయి ఉద్యోగులు ప్రమోషన్లు లేక కెరీర్‌లో స్తబ్దతను ఎదుర్కొంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, ప్రతి ఉద్యోగికి తన సర్వీస్ కాలంలో కనీసం ఐదు ప్రమోషన్లు కచ్చితంగా లభించేలా 8th Pay Commission లో నిబంధనలు చేర్చాలని ఆల్ ఇండియా డిఫెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (AIDEF) సెక్రటరీ జనరల్ సి. శ్రీకుమార్ డిమాండ్ చేశారు. ఇది ప్రతిభావంతులైన యువ ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
జీతాల వ్యత్యాసం తగ్గాలి: గరిష్ట పరిమితి 10 రెట్లు మాత్రమే!
ప్రస్తుతం ఉన్న 7వ పే కమిషన్‌లో కనిష్ట, గరిష్ట ప్రాథమిక వేతనాల మధ్య వ్యత్యాసం 13 రెట్లుగా ఉంది. అయితే 8th Pay Commission లో ఈ అంతరాన్ని తగ్గించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. అత్యధిక జీతం పొందే అధికారి వేతనం, కనిష్ట వేతనం కంటే 10 రెట్లు మించకుండా ఉండాలని వారు ప్రతిపాదించారు. దీనివల్ల కింది స్థాయి ఉద్యోగుల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయని భావిస్తున్నారు.
ఫ్యామిలీ యూనిట్ల పెంపు.. తల్లిదండ్రులకు కూడా మేలు!
జీతాల సవరణ లెక్కల్లో ఇప్పటివరకు ఫ్యామిలీ యూనిట్లను 3 గా పరిగణించేవారు. కానీ, మారుతున్న కాలానికి అనుగుణంగా దీనిని 5కి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఉద్యోగిపై ఆధారపడిన తల్లిదండ్రులను కూడా ఈ పరిధిలోకి తీసుకురావడం. దీనివల్ల అలవెన్సులు , ఇతర ప్రయోజనాలు మరింత పెరిగే అవకాశం ఉంది.
పెన్షనర్లకు తీపి కబురు: ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై చర్చ
ఈ సమావేశంలో సుమారు 68 లక్షల మంది పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్ల గురించి కూడా కీలక చర్చ జరిగింది. ఉద్యోగులకు వర్తింపజేసే అదే 'ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్' ను పెన్షనర్లకు కూడా వర్తింపజేయాలని కోరుతున్నారు. పెన్షనర్లలో 60 శాతం మంది మాజీ సైనికులు లేదా వారిపై ఆధారపడిన వారు కావడంతో వారికి న్యాయం జరగాలని ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి.
తదుపరి అడుగు ఏమిటి?
మార్చి 10, 2026న మరో కీలక సమావేశం జరగనుంది. ఈ మీటింగ్‌లో ఒక ఉమ్మడి వినతిపత్రాన్ని (Memorandum) సిద్ధం చేసి, వారం పది రోజుల్లో పే కమిషన్‌కు సమర్పించనున్నారు. అలాగే పే కమిషన్ అడిగిన 18 ప్రశ్నలకు సమాధానాలను త్వరగా పంపడం ద్వారా ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించారు. దీనితో పాటు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (OPS) పునరుద్ధరణపై కూడా చర్చలు కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications