కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. డీఏ–బేసిక్ పే విలీనం లేదని స్పష్టం చేసిన కేంద్రం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన 8వ వేతన సంఘం (8th Pay Commission)పై దేశవ్యాప్తంగా ఉద్యోగుల దృష్టి కేంద్రీకృతమైంది. ఈ నేపథ్యంలో, డీఏ-బేసిక్ పే విలీనంపై నెలకొన్న అనుమానాలకు సోమవారం కేంద్ర ప్రభుత్వం అధికారిక స్పష్టత ఇచ్చింది. 8వ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించిన లోక్‌సభ ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. కేంద్రం ప్రస్తుతం డీఏ లేదా కరువు భత్యంలోని ఏ భాగాన్నీ ప్రాథమిక వేతనంలో కలపాలన్న ఆలోచన లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వం లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని పేర్కొంది.
ప్రస్తుత డీఏను ప్రాథమిక వేతనంలో విలీనం చేసే ప్రతిపాదన ప్రభుత్వం పరిశీలనలో లేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి డిసెంబర్ 1న పార్లమెంటులో తెలిపారు. ఈ సమాధానం ద్వారా, ఇటీవల ఉద్యోగ సంఘాలు ప్రస్తుత 58 శాతం డీఏలో కనీసం 50 శాతం మొత్తాన్ని బేసిక్ పేలో విలీనం చేయాలన్న డిమాండ్లు విస్తృత చర్చనీయాంశమవుతున్న సమయంలో కేంద్రం క్లారిటీ ఇచ్చింది. 8వ వేతన సంఘం 2027 తరువాతే అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నందున.. ఉద్యోగ సంఘాలు ముందస్తు డీఏ-బేసిక్ విలీనంపై ఒత్తిడి పెంచుతున్న సందర్భంలో కేంద్రం నుంచి ఈ సమాధానం ఇచ్చింది.

డీఏ DR (Dearness Relief) నిర్ణయాలు CPI ఆధారంగా ప్రతి ఆరు నెలలకోసారి సవరించబడతాయని ప్రభుత్వం తెలిపింది. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకి చెందిన కార్మిక బ్యూరో విడుదల చేసే ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (AICPI-IW) గణాంకాల ఆధారంగా ఈ రేట్లు మారతాయి. జీవన వ్యయాల్లో పెరుగుదలను బ్యాలెన్స్ చేయటం, ద్రవ్యోల్బణం ప్రభావం కారణంగా వాస్తవ విలువలో కోత నుంచి వేతనం, పెన్షన్‌ను రక్షించడం దీనిలోని ఉద్దేశ్యమని ప్రభుత్వం వివరించింది.
8వ వేతన సంఘం కోసం Terms of Reference (ToR) ను కేంద్ర మంత్రివర్గం అక్టోబర్ 28న ఆమోదించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రంజనా ప్రకాష్ దేశాయ్ కమిషన్‌కు చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. కమిషన్ దాదాపు 18 నెలల్లోపు తన సిఫార్సులను సమర్పిస్తుందని.. 2026 జనవరి 1 నుండి కొత్త వేతన నిర్మాణం అమల్లోకి వచ్చే అవకాశం ఉందని కేంద్ర ఐ & బి మంత్రి అశ్విని వైష్ణవ్ క్యాబినెట్ బ్రీఫింగ్‌లో వెల్లడించారు.
దాదాపు 50 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 67 లక్షల పెన్షనర్లు ఈ వేతన సంఘం నిర్ణయాల వల్ల నేరుగా ప్రభావితం కానున్నారు. కేంద్ర వేతన సంఘాలు సాధారణంగా పదేళ్లకొకసారి వేతన నిర్మాణం, పదవీ విరమణ ప్రయోజనాలు, భత్యాలు, సేవా నిబంధనలను సమీక్షించి ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తాయి. 6వ CPC 2006లో, 7వ CPC 2016లో అమల్లోకి వచ్చిన నేపథ్యంలో 8వ CPC అమలుకు సమయం చేరువవుతున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే ెన్నో ఊహాగానాల నడుమ ఉద్యోగులు ఆశించిన డీఏ-బేసిక్ పే విలీనానికి సంబంధించిన నిర్ణయం ప్రభుత్వంచే తిరస్కరణకు గురైనట్టేనని చెప్పవచ్చు. కాబట్టి వారి వేతన పెంపు ఆశలు ఇప్పుడు పూర్తిగా 8వ వేతన సంఘం సిఫార్సులపై ఆధారపడనున్నాయి.


Click it and Unblock the Notifications