rupee : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రపంచ దేశాల్లో భారత్ పరపతి పెరిగింది. అమెరికా సహా ఆయా దేశాలు రష్యాపై ఆంక్షలు విధించడం తెలిసిందే. అంతర్జాతీయ చెల్లింపుల విధానం స్విఫ్ట్ నుంచి ఆ దేశ బ్యాంకులను తొలగించడమూ చకచకా జరిగిపోయింది. ఈ సమయంలో మన ఆప్తమిత్రుడు రష్యాతోవాణిజ్యసంబంధాలు దెబ్బతినకుండా పేమెంట్స్ జరుపుకోవడానికిప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాల్సి వచ్చింది. అంతకు పూర్వమే ఈ విధానం చర్చల్లో ఉంది. కానీ ఈ గడ్డు పరిస్థితుల్లో తప్పనిసరిగా ఆచరణలోనికి తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది.

అర్థ శతాబ్ధపు ట్రేడింగ్ 6 నెలల్లోనే..
భారతీయ కరెన్సీ రూపాయితో వాణిజ్యం జరపడం కోసం 8 దేశాలు 'స్పెషల్ రూపీ ఓస్ట్రో ఎకౌంట్ల'ను తెరిచాయి. ఇవి ప్రారంభమైన 6 నెలల్లోనే దాదాపు అర్థ శతాబ్దంలో జరిగిన విలువకు సమానమైన వాణిజ్యం నెరిపినట్లు తెలుస్తోంది. తద్వారా మరిన్ని దేశాలు ఈ విధానంలో చేరేందుకు ఆసక్తిని కనపరుస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే రోజు రోజుకీ మార్కెట్లో రూపాయికి మంచి డిమాండ్ ఏర్పడుతోంది. ప్రపంచ వాణిజ్యంలో భారత కరెన్సీ వినియోగం బలపడుతోంది. ఇప్పటివరకు 49 ఓస్ట్రో ఎకౌంట్స్ ఓపెన్ చేసినట్లు ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది.

సంక్షోభమే అవకాశంగా..
రష్యా, శ్రీలంక, మారిషస్, మలేషియా, సింగపూర్, మయన్మార్, ఇజ్రాయిల్, జర్మనీలు.. ఇప్పటి వరకు రూపాయి ద్వారా వాణిజ్యం జరపడానికి ఓస్ట్రో అకౌంట్స్ తెరిచాయి. వివిధ దేశాల మధ్య రూపీ వాణిజ్యానికి సంబంధించిన నిబంధనలను గతేడాది జూలైలో రిజర్వ్ బ్యాంక్ విడుదల చేయడంతో ఇది సాధ్యపడింది. రష్యా మీద ఆంక్షల కారణంగా ఆ దేశంతో వ్యాపారం చేయడానికి మరో కరెన్సీ అవసరమైంది. అయితే ప్రపంచ శక్తిగా ఎదగాలని చూస్తున్న భారత్.. ఈ సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుంది. డాలర్ కు ప్రత్యామ్నాయంగా మన కరెన్సీ రూపీని విరివిగా వాడుకులోకి తేవాలని చూస్తున్న ప్రయత్నాలు ఫలించినట్లే కనిపిస్తున్నాయి.

ఇదీ పనితీరు:
ఈ ఓస్ట్రో ఎకౌంటు కలిగిన వారు.. భారతదేశ ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. కొత్త విధానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు RBI ఆ వెసులుబాటు కల్పించింది. ఈ విధానం ప్రకారం ఇక్కడ దిగుమతి చేసుకునే వ్యాపారులు.. ఇతర దేశాల్లోని ఎగుమతిదారులకు రూపాయల్లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ నగదును ఆయా దేశాల బ్యాంకులకు చెందిన ఓస్ట్రో ఎకౌంట్లలో జమవుతాయని రిజర్వు బ్యాంకు వెల్లడించింది. అయితే స్పెషల్ రూపీ ఓస్ట్రో ఎకౌంట్, రూపీ ఓస్ట్రో ఎకౌంట్ల మధ్య కొంత తేడా ఉందని గమనించాలి.


Click it and Unblock the Notifications