కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఏ 60 శాతం నుంచి 63 శాతానికి పెరిగే అవకాశం..
7th Pay Commission Latest News: దేశవ్యాప్తంగా ఉన్న కోటిన్నరకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ కరువు భత్యం (డీఏ), కరువు ఉపశమనం (డీఆర్) సవరణ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రతి ఏటా రెండుసార్లు జరిగే ఈ ప్రక్రియలో భాగంగా, జూలై 2026 నుండి అమల్లోకి వచ్చేలా 3 శాతం డీఏ పెంపుపై ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖ, మంత్రిమండలి వర్గాల్లో కీలక చర్చలు సాగుతున్నాయి.
ఒకవేళ కేంద్ర కేబినెట్ ఈ ప్రతిపాదనకు అధికారికంగా ఆమోదముద్ర వేస్తే, ప్రస్తుతం అమలులో ఉన్న 60 శాతం డీఏ రేటు ఏకంగా 63 శాతానికి చేరుకుంటుంది. దసరా, దీపావళి వంటి ప్రధాన పండుగల సీజన్ నడుస్తుండటంతో, ఉద్యోగుల చేతికి అదనపు నగదు అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వం నుండి ఈ ప్రకటన ఏ క్షణంలోనైనా వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు భావిస్తున్నాయి.

ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ (AICPI-IW) ఆధారంగా ప్రతి ఏటా రెండుసార్లు (జనవరి మరియు జూలై) ద్రవ్యోల్బణ సవరణలు చేపడతారు. నిత్యావసర వస్తువుల ధరలు, ద్రవ్యోల్బణం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్ల కొనుగోలు శక్తి పడిపోకుండా కాపాడటమే ఈ కరువు భత్యం యొక్క ప్రధాన ఉద్దేశం.
గడిచిన ఆరు నెలల వినియోగదారుల ధరల సూచీ గణాంకాలను విశ్లేషించిన నిపుణులు, ఈసారి 3 శాతం పాయింట్ల మేర సవరణ ఖాయమని అంచనా వేస్తున్నారు. ఇటీవలే కేంద్రం రైల్వే ఉద్యోగులకు 78 రోజుల ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ ఆమోదించిన నేపథ్యంలో, సాధారణ డీఏ పెంపు నోటిఫికేషన్ కూడా దానికి అనుబంధంగా త్వరలోనే వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి.
జీతాల్లో రానున్న మార్పులు - అంచనా:
ఈ 3 శాతం పెంపుదల ఆమోదం పొందితే ప్రతినెల అందే నికర వేతనంలో గణనీయమైన మార్పులు రానున్నాయి:
కనిష్ఠ మూల వేతనం : ప్రస్తుతం 60 శాతం డీఏ రేటు వద్ద నెలకు రూ. 10,800 పొందుతున్న ఉద్యోగికి, 63 శాతానికి పెరిగితే ఆ మొత్తం రూ. 11,340కి చేరుతుంది. అంటే నెలకు అదనంగా రూ.540 చొప్పున, వార్షికంగా రూ.రూ. 6,480 అదనపు లబ్ధి చేకూరుతుంది.
మధ్యస్థాయి వేతనం : ఈ మూల వేతనం ఉన్న ఉద్యోగులకు డీఏ ప్రస్తుతం రూ. 15,300 ఉండగా, సవరణ తర్వాత అది ₹16,065 అవుతుంది. దీనివల్ల నెలకు ₹765 అదనంగా లభిస్తుంది.
ఉన్నతాధికారుల వేతనం : ఈ శ్లాబులోని అధికారులకు డీఏ ద్వారా ప్రస్తుతం లభిస్తున్న రూ.33,660కి అదనంగా నెలకు రూ. 1,683 పెరిగి రూ. 35,343 కి చేరుకుంటుంది.
మూడు నెలల బకాయిలు (Arrears) ఒకేసారి: ఈ పెంపుదల ప్రకటన సాధారణంగా అక్టోబర్ చివరలో వెలువడే అవకాశం ఉన్నందున, ఇది జూలై 1, 2026 నాటి నుండే అమల్లోకి వస్తుంది. కాబట్టి జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించిన 3 నెలల డీఏ వ్యత్యాస బకాయిల నగదును ఉద్యోగుల ఖాతాల్లో ఒకే విడతగా జమ చేస్తారు. ఇది పండుగ కొనుగోళ్ల సమయంలో ఉద్యోగ కుటుంబాలకు ఎంతో ఊరటనివ్వనుంది. అఖిల భారత రక్షణ ఉద్యోగుల సమాఖ్య (AIDEF) సహా వివిధ కేంద్ర ఉద్యోగ సంఘాలు డీఏ ప్రకటనను ఆలస్యం చేయకుండా వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని నిరంతరం కోరుతున్నాయి. అయితే, ఈ పెంపునకు సంబంధించిన తుది రేటు, చెల్లింపుల షెడ్యూల్, తేదీలపై అధికారిక స్పష్టత కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని వ్యయ విభాగం (Department of Expenditure) విడుదల చేసే జీవో ద్వారా మాత్రమే వెల్లడికానుంది.
గమనిక: ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందే కరువు భత్యం (DA), పెన్షనర్లకు అందే కరువు ఉపశమనం (DR) లెక్కలు మరియు అలవెన్సులు అన్నీ 7వ పే కమిషన్ సిఫార్సుల ఆధారంగానే జరుగుతున్నాయి. 8వ వేతన సంఘం (8th Pay Commission) ఇంకా అమలులోకి రాలేదు (ప్రభుత్వం దీని ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది). కాబట్టి ప్రస్తుతం జరుగుతున్న 3% డీఏ పెంపు (60% నుండి 63%కి పెంపు) అంచనాలు పూర్తిగా 7వ పే కమిషన్ శ్లాబుల కిందకే వస్తాయి.


Click it and Unblock the Notifications
