IPO News: మార్కెట్లోకి వస్తున్న 68 ఏళ్ల కంపెనీ ఐపీవో.. ఇన్వెస్టర్స్ ఈ విషయాలు తెలుసుకోండి..
Godavari Biorefineries IPO: నెల మధ్యలోకి వచ్చిన తర్వాత ఐపీవోల కోలాహలం కొనసాగుతోంది. ఈ క్రమంలో వరుసగా వస్తున్న ఐపీవోలు ఇన్వెస్టర్లకు భారీగా లాభాలను తెచ్చిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇన్వెస్టర్లు సైతం ఉన్న ఐపీవోలలో తమకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకుని డబ్బును పెట్టుబడిగా పెట్టడానికి ఉన్న అవకాశాలను అన్వేషిస్తున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది గోదావరి బయోరిఫైనరీస్ కంపెనీ ఐపీవో గురించే. 68 ఏళ్ల పురాతనమైన కంపెనీ తన ఐపీవోను మార్కెట్లో లిస్ట్ చేసేందుకు వస్తోంది. మెయిన్ బోర్డ్ కేటగిరీలో వస్తున్న ఐపీవో దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.555 కోట్లను సమీకరించే లక్ష్యంతో ముందుకు వస్తోంది. ఈ క్రమంలో ఐపీవో రిటైల్ ఇన్వెస్టర్ల కోసం అక్టోబర్ 23 నుంచి అక్టోబర్ 25 వరకు అందుబాటులో ఉండనుంది. ఇదే క్రమంలో యాంకర్ ఇన్వెస్టర్లకు ఐపీవో ఒకరోజు ముందుగా అక్టోబర్ 22న తెరుచుకోనుంది. ఈ ఐపీవో కోసం కంపెనీ తన ఒక్కో షేరు ప్రైస్ బ్యాండ్ ధరను రూ.334-352గా నిర్ణయించింది.

కంపెనీ తన ఐపీవోలో తాజా ఇష్యూతో పాటు ఆఫర్ ఫర్ సేల్ కూడా ఉన్నట్లు వెల్లడించింది. మెుత్తం ఐపీవోలో రూ.325 కోట్లకు తాజా ఈక్విటీ షేర్లను ఇష్యూ చేస్తుండగా, మిగిలిన మెుత్తం 65.3 లక్షల షేర్లను ప్రమోటర్లు ఆఫర్ ఫర్ సేల్ రూపంలో విక్రయించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ క్రమంలో ప్రైవేట్ ఈక్విటీ సంస్థ మండల క్యాపిటల్ తనకున్న మెుత్తం 49,26,983 వాటాలను కూడా ఆఫర్లో విక్రయానికి ఉంచింది. కంపెనీ తాజా ఐపీవోలో లాట్ పరిమాణాన్ని 42 షేర్లుగా ఉంచింది. దీంతో రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాటు కొనుగోలు కోసం రూ.14,748 పెట్టుబడిగా పెట్టాల్సి వస్తోంది. కంపెనీ షేర్లు ఈ క్రమంలో ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో ఏకకాలంలో లిస్టింగ్ జరగనున్నాయి.
ఇథనాల్ ఆధారిత కెమికల్స్ తయారీ వ్యాపారంలో ఉన్న కంపెనీ వాస్తవానికి 1956లో స్థాపించబడింది. కంపెనీ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోలో బయో-ఆధారిత రసాయనాలు, చక్కెర, వివిధ రకాల ఇథనాల్, పవర్ ఉన్నాయి. ఈ ఉత్పత్తులు ఆహారం, పానీయాలు, ఔషధాలు, రుచులు-సువాసనలు, శక్తి, ఇంధనం, వ్యక్తిగత సంరక్షణ, సౌందర్య సాధనాల వంటి పరిశ్రమలలో ఉపయోగిస్తుంటారు. కంపెనీ తాజా ఐపీవో నుంచి సమీకరించిన సొమ్మును పాక్షికంగా లేదా పూర్తిగా రుణాలను చెల్లించటానికి వినియోగించాలని నిర్ణయించింది. దీనికి తోడు సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం కంపెనీ ఐపీవో డబ్బును ఉపయోగించాలని చూస్తోంది. రానున్న వారంలో ఈ ఐపీవో తెరచుకోనున్నందున ఇన్వెస్టర్లు కంపెనీ గురించి పూర్తిగా స్టడీ చేసే పనిలో ఉన్నారు. దీని తర్వాత ఐపీవోపై బెట్టింగ్ వేయాలా వద్దా అనే నిర్ణయానికి వారు రానున్నారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications