GST Meet: నేడు GST కౌన్సిల్ సమావేశం.. రైల్వే, ఆల్కహాల్, ఆన్‌లైన్ గేమింగ్‌లపై కీలక నిర్ణయాలు..
GST Meet: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన GST కౌన్సిల్ సమావేశం ఇవాళ జరుగుతోంది. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ ఈ 52వ మీటింగ్ కు వేదికైంది. ఆన్ లైన్ గేమింగ్ పై పన్నులు, దృష్టిలోపం ఉన్న వ్యక్తులు వినియోగించే వాహనాలు సహా వివిధ ఉత్పత్తులపై GST రేట్ల సర్దుబాటు గురించి ఇందులో చర్చించనున్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.
నివేదిక ప్రకారం.. మద్యం తయారీలో ఉపయోగించే డిస్టిల్డ్ ఆల్కహాల్‌ను పరోక్ష పన్ను నుంచి మినహాయించే అవకాశం ఉంది. ఇందులో 95 శాతం ఆల్కహాల్ ఉండగా.. పారిశ్రామిక ప్రయోజనాల కోసం దీన్ని విరివిగా వినియోగిస్తుంటారు. మొలాసిస్‌పైనా GSTని 28 నుంచి 5 శాతానికి తగ్గించే ప్రతిపాదనను కూడా కౌన్సిల్ పరిశీలించనుంది.

మునుపటి కౌన్సిల్ సమావేశంలో ఆమోదించిన విధంగా.. SGST చట్టాలలో ఆన్‌లైన్ గేమింగ్ పన్నుకు సంబంధించి రాష్ట్రాలు చేసిన మార్పులను సమీక్షించే అవకాశం ఉంది. దృష్టి లోపం కలిగిన వారు కొనుగోలు చేసే వాహనాలపై 18 శాతం పన్ను రాయితీ ఇస్తారని భావిస్తున్నారు. కంపెనీకి డైరెక్టర్లు, ప్రమోటర్లు అందించే బ్యాంకు మరియు కార్పొరేట్ గ్యారెంటీల మీద విధించనున్న పన్నుపై కౌన్సిల్ స్పష్టత ఇవ్వవచ్చని తెలుస్తోంది.
పౌడర్ రూపంలో విక్రయించే తృణధాన్యాలపై పన్ను మినహాయింపును ఈ సమావేశంలో కౌన్సిల్ పరిశీలిస్తుందని నివేదిక చెబుతోంది. రైల్వే సేవలు అన్నింటినీ RCM నుంచి ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం కిందకు తీసుకురావాలనే ప్రతిపాదన ఉంది. వీటితో పాటు పలు రాష్ట్రాలు లేవనెత్తిన ఆందోళనలపైనా చర్చించనుంది.


Click it and Unblock the Notifications