Barclays Layoffs: ఆర్థిక మందగమనం దావానలం ఇప్పుడు మరిన్ని రంగాలకు విస్తరిస్తోంది. రోజులు గడుస్తున్న కొద్దీ కొత్త రంగాలపై దీని ప్రభావం కనిపిస్తోంది. దీంతో దిగ్గజ కంపెనీలు సైతం ఉద్యోగులను తగ్గించుకోవటం సంచలనం సృష్టిస్తోంది.
ప్రపంచంలోనే 10వ అతిపెద్ద బ్యాంక్ బార్‌క్లేస్ భారీగా ఉద్యోగుల తొలగింపులకు సిద్ధమైంది. 1.25 బిలియన్ డాలర్ల ఖర్చులను తగ్గించుకునే క్రమంలో కంపెనీ 2,000 మందిని తొలగించే అవకాశం ఉందని రాయిటర్స్ వార్తా సంస్థ నివేదించింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా బార్‌క్లేస్ బ్యాంక్ 81,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. ఈ దిగ్గజ బ్యాంక్ స్థాపించి దాదాపు 333 ఏళ్లు పూర్తైంది. 1690లో బ్యాంక్ స్థాపించబడింది.

బార్‌క్లేస్ ఇటీవలి సంవత్సరాల్లో బోనస్‌లను తగ్గించడం, ఉద్యోగాల సంఖ్యను తగ్గించటం వంటి చర్యలు చేపడుతోంది. దిగ్గజ బ్యాంక్ తన వ్యాపారాల్లో ఖర్చులను తగ్గించుకోవాలని తీవ్రంగా ప్రయత్నాలు కొనసాగిస్తోంది. రానున్న కాలంలో కంపెనీ మెుత్తంగా బిలియన్ల పౌండ్ల మేర వ్యయాలను తగ్గించుకోవాలని బ్యాంక్ చూస్తున్నట్లు సీఈవో సీఎస్ వెంకటకృష్ణన్ తెలిపారు. ఇందులో భాగంగా కంపెనీ BX అని పిలువబడే బార్‌క్లేస్ ఎగ్జిక్యూషన్ సర్వీసెస్‌లో పనిచేస్తున్న ఉద్యోగులపై కోతలు అతిపెద్ద ప్రభావాన్ని చూపుతాయని తెలుస్తోంది.
ఈ సిబ్బంది కోత భారతదేశంలో పనిచేస్తున్న ఉద్యోగులపై ప్రభావం చూపుతుందా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. సిబ్బంది కోతలు ప్రధానంగా బ్రిటిష్ బ్యాంకు కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందిపై ప్రభావం చూపుతాయని రాయిటర్స్ తన నివేదికలో ప్రస్థావించింది. 2017లో దాదాపు 20 వేలుగా ఉన్న ఉద్యోగుల సంఖ్య.. 2022 నాటికి 22,300కి పెరిగింది. దీంతో వ్యయాలు కూడా పెరిగాయి. అయితే ప్రస్తుతం మందగించిన వ్యాపార వాతావరణం కారణంగా ఈ వ్యయాలను తగ్గించాలని నిర్ణయించిందని సమాచారం.


Click it and Unblock the Notifications