Budget 2024: నెలకు 300 యూనిట్ల కరెంట్ ఫ్రీ..!
కోటి ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లను అమర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించింది. ప్రధాన మంత్రి సూర్యోదయ యోజన పేరుతో ఈ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే . ఈ పథకానికి బడ్జెట్‌లో రూ.10 వేల కోట్లు కేటాయించినట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా రూఫ్‌టాప్ సోలార్ స్కీమ్ కోసం రూ.10 వేల కోట్లు కేటాయించారు.
ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ప్రజలు తమ ఇంటి పైకప్పులపై విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవచ్చని తెలిపారు. పైకప్పులపై సౌర ఫలకాలను అమర్చడం ద్వారా ప్రజలు ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను పొందవచ్చని నిర్మలా సీతారామన్ వివరించారు. దీని ద్వారా సంవత్సరానికి రూ.15,000 నుంచి 18,000 వరకు ఆదా చేయవచ్చని చెప్పారు. ప్రజలు తమ పైకప్పులపై ఉత్పత్తి చేసే విద్యుత్‌ను ఉపయోగించుకోవడమే కాకుండా, అవసరానికి మించి అదనపు విద్యుత్‌ను కూడా విక్రయించవచ్చని తెలిపారు.

ఈ విద్యుత్‌ను ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జ్ చేయడానికి కూడా ఉపయోగించవచ్చనిఅన్నారు. పునరుత్పాదక ఇంధన వనరులకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ఇందులోభాగంగా సౌరశక్తితో 100 గిగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. గత సంవత్సరాల్లో సౌరశక్తి నుంచి విద్యుత్ ఉత్పత్తిలో పెరుగుదల ఉందన్నారు.
2019-20 ఆర్థిక సంవత్సరంలో సౌరశక్తితో దాదాపు 35 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయిందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ ఉత్పత్తి 73 గిగావాట్లను పెరుగుతుందని పేర్కొన్నారు.ప్రధాన మంత్రి సూర్యోదయ యోజన కింద 1 కోటి ఇళ్ల పైకప్పులపై రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేయడం ద్వారా 100 గిగావాట్ల లక్ష్యాన్ని చేరుకోవడంలో ప్రభుత్వం సహాయపడుతుందని వివరించారు.


Click it and Unblock the Notifications