Hyderabad: గడచిన ఏడాది కాలంలో అఫోర్డబుల్, తక్కువ మార్జిన్ మాస్ హౌసింగ్ ప్రాజెక్టులు హైదరాబాద్ నగరంలో భారీగా పడిపోయాయి. నగరంలో భూమి రేట్లు ఆకాశాన్ని తాకటంతో డెవలపర్లు వెనకడుగు వేస్తున్నారు.
సరసమైన ఇళ్ల సరఫరా, అమ్మకాలు రెండూ 50 శాతం మేర తగ్గినట్లు ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ అనరాక్ నివేదించింది. మూడేళ్ల కిందట 2 BHK ప్రాపర్టీ ధర రూ.50 లక్షల కంటే కిందన ఉండేది. కానీ ఇప్పుడు సామాన్యులు కొనలేని స్థితికి అంటే రూ.70 లక్షల నుంచి రూ.90 లక్షల మధ్యకు చేరుకున్నాయని నివేదికలో వెల్లడైంది. ఈ ధరలకు మధ్యతరగతి ప్రజలు ఇల్లు కొనటం చాలా కష్టంగా మారింది.

ఇదే క్రమంలో ప్రైమ్ ఏరియాల్లో 3 BHK ప్రాపర్టీలు కనీసం కోటి రూపాయలుగా మారిపోయింది. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి భూమి ధరలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, బిల్డింగ్ మెటీరియల్, లేబర్ ఖర్చులు, ఇతర ఖర్చులు భారీగా పెరిగాయని నగరంలోని రియల్టర్లు చెబుతున్నారు. ఇవి రాష్ట్రవ్యాప్తంగా ఫ్లాట్ రేట్ల పెరుగుదలకు దోహదపడ్డాయని వారు చెబుతున్నారు. 2020కి ముందు నగరంలో చదరపు అడుగు ధర ఏరియాను బట్టి రూ.3,500 నుంచి రూ.4,000 మధ్య ఉండేది. కానీ ఇప్పుడు అది రూ.6,000కి పైన కొనసాగుతోంది. నిర్మాణ వ్యయం తగ్గితే ఫ్లాట్ ధరలు తగ్గే అవకాశం ఉందని రియల్టర్లు చెబుతున్నారు.
సరసమైన గృహ కొనుగోలుదారులు తమ నిర్ణయాలను వాయిదా వేసుకోవటంతో.. డెవలపర్లు ప్రస్తుతం మధ్య-శ్రేణి, ప్రీమియం, లగ్జరీ ప్రాజెక్ట్‌లపై దృష్టి సారిస్తున్నారు. సరసమైన గృహాల విభాగంలో కొనుగోలుదారులు, డెవలపర్లు ఎదుర్కొంటున్న సవాళ్లు కరోనా మహమ్మారి ప్రభావానికి మించి ఉన్నాయని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరి పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications