ఇటీవల ఆన్‌లైన్ డెలివరీ యాప్‌లు మన దైనందిన జీవితంలో విడదీయరాని భాగంగా మారాయి. కిరాణా సరుకులు కావాలన్నా, కూరగాయలు లేదా ఇతర నిత్యావసరాలు కావాలన్నా..కేవలం కొన్ని నిమిషాల్లోనే మన ఇంటి ముందే డెలివరీ అవుతున్నాయి. ఈ సౌకర్యం వల్ల వినియోగదారుల జీవితం ఎంతగానో సులభతరమైంది. అయితే దీని వెనుక పనిచేస్తున్న డెలివరీ ఏజెంట్ల కష్టం, వారు పొందుతున్న ఆదాయం గురించి మనం నిజంగా ఎంతవరకు ఆలోచిస్తున్నాం అనే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీస్తోంది.
ప్రస్తుతం బ్లింకిట్‌కు చెందిన ఓ డెలివరీ ఏజెంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో @thapliyaljivlogs అనే యూజర్ షేర్ చేశాడు. తన రోజువారీ పనితీరు, సంపాదన వివరాలను స్పష్టంగా చూపిస్తూ అతడు వీడియోలో మాట్లాడారు. ఒక రోజు తాను ఏకంగా 14 గంటలకు పైగా పనిచేసి 28 ఆర్డర్లు డెలివరీ చేసినట్లు అతడు తెలిపాడు. అయితే.. అంత కష్టపడ్డప్పటికీ ఇన్సెంటివ్‌తో కలిపి తనకు వచ్చిన మొత్తం ఆదాయం కేవలం రూ.762 మాత్రమేనని చెప్పాడు.

తన మొబైల్‌లోని బ్లింకిట్ యాప్ స్క్రీన్‌షాట్‌లను చూపిస్తూ.. ఒక్కో డెలివరీకి ఎంత చెల్లింపు వస్తుందో వివరించాడు.ఇంత కష్టపడి పనిచేస్తున్నా బ్లింకిట్ చాలా తక్కువ డబ్బు ఇస్తోంది అంటూ అతడు తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ఈ వీడియో చూసిన చాలామంది నెటిజన్లు ఆశ్చర్యానికి గురయ్యారు. రోజంతా రోడ్లపై తిరిగి, ఎండా వానా చూడకుండా పని చేసినా సరైన ప్రతిఫలం దక్కడం లేదని పలువురు వ్యాఖ్యానించారు.
సోషల్ మీడియాలో ఈ వీడియోపై నెటిజన్ల నుంచి భారీ స్పందన వచ్చింది. కొందరు నెటిజన్లు డెలివరీ ఏజెంట్ల పరిస్థితిపై సానుభూతి వ్యక్తం చేయగా.. మరికొందరు గిగ్ ఎకానమీ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. మనకు రూ. 20 లేదా రూ. 30 పెద్ద మొత్తం కాకపోవచ్చు, కానీ డెలివరీ ఏజెంట్లకు అదే పెద్ద సహాయం. కాబట్టి వీలైనంతవరకు వారికి టిప్ ఇవ్వాలని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. ఇంకొందరు మాత్రం పెద్ద కంపెనీలు డెలివరీ పార్ట్‌నర్లకు కనీస వేతనం కూడా సరిగా ఇవ్వడం లేదని తప్పుబట్టారు.
ఇదిలా ఉంటే అదే Blinkit డెలివరీ ఏజెంట్ మరో వీడియోను కూడా షేర్ చేశాడు. ఆ వీడియోలో మరో రోజు అతడు 11 గంటలు పనిచేసి 32 ఆర్డర్లు డెలివరీ చేసినట్లు.. దానికి గానూ రూ. 1202 సంపాదించినట్లు చూపించాడు. దీన్ని బట్టి డెలివరీ ఏజెంట్ల ఆదాయం రోజురోజుకూ ఒకేలా ఉండదని స్పష్టమవుతోంది. ఆర్డర్ల సంఖ్య, పీక్ అవర్స్, ఇన్సెంటివ్‌లు, ప్రాంతం వంటి అనేక అంశాలపై వారి సంపాదన ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు.
ఏదేమైనా ఈ వైరల్ వీడియో గిగ్ వర్కర్ల జీవన పరిస్థితులపై సమాజాన్ని ఆలోచించాల్సిన పరిస్థితికి తీసుకువచ్చింది. మనకు సౌకర్యంగా కనిపించే ఆన్‌లైన్ డెలివరీ సేవల వెనుక ఎంతో మంది కష్టపడుతున్నారని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని చాలామంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications