Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్ల జారీ ప్రకటించిన SBI.. నేటి నుంచి కొనుగోళ్లు షురూ..
Electoral Bonds: సాధారణంగా ప్రజలు వివిధ కార్యక్రమాలకు విరాళాలు ఇస్తూ ఉంటారు. దైవ కార్యాలకు, అనాథ శరణాలయాలకు, వృద్ధాశ్రమాలకు తోచినంత సాయం చేస్తూ మంచి మనసు చాటుకుంటారు. అయితే వివిధ రాజకీయ పార్టీలూ పెద్దమొత్తంలో విరాళాలను అందుకుంటూ ఉంటాయి. ఈ ప్రక్రియ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా జరుగుతూ ఉంటుంది.
నేటి నుంచి ఎలక్టోరల్ బాండ్ లను విక్రయించనున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రకటించింది. 29 శాఖల ద్వారా వీటిని జారీ చేయనున్నట్లు పేర్కొంది. కాగా ఈ ప్రక్రియ ఏప్రిల్ 12 వరకు కొనసాగనున్నట్లు వెల్లడించింది. ఇప్పటివరకు 25 దఫాలు బాండ్ల విడుదల జరపగా.. ప్రస్తుతం 26వ సారి విక్రయాలు చేపట్టినట్లు తెలిపింది.

పొలిటికల్ ఫండింగ్ ను నిరోధించడమే లక్ష్యంగా దేశంలో ఎలక్టోరల్ బాండ్లు ప్రవేశపెట్టబడ్డాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం.. ఏటా జనవరి, ఏప్రిల్, జూలై మరియు అక్టోబరు నెలల్లో 10 రోజుల పాటు కొనుగోలు చేయడానికి ఈ బాండ్లు అందుబాటులో ఉంటాయి. కాగా మే 10న ఒకే దశలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. వీటి విక్రయం ప్రాధాన్యత సంతరించుకుంది.
భారతదేశ పౌరులు ఎవరైనా ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేయవచ్చు. వ్యక్తిగా లేదా ఇతరులతో కలిసి సమిష్ఠిగానూ వీటిని పొందవచ్చు. అయితే నిబంధనల ప్రకారం.. గత సార్వత్రిక ఎన్నికల్లో కనీసం 1 శాతం కంటే ఎక్కువ ఓట్లు సాధించిన రాజకీయ పార్టీలు మాత్రమే ఈ బాండ్లను స్వీకరించడానికి అర్హులు.
ఎలక్టోరల్ బాండ్ లు ఇష్యూ తేదీ నుంచి 15 క్యాలెండర్ రోజుల వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. గడువు ముగిసిన తర్వాత డిపాజిట్ చేయబడితే గనుక వాటిని లెక్కలోకి తీసుకోరు. అంటే వాటిని ఏ రాజకీయ పార్టీకి చెల్లించరు. అర్హత ఉన్న రాజకీయ పార్టీ ఖాతాలో వేసిన బాండ్ అదే రోజున జమ అవుతుంది. జనవరి 2, 2018న ప్రభుత్వం ఎలక్టోరల్ బాండ్ స్కీమ్‌ను నోటిఫై చేసింది. అప్పటి నుంచి ఈ వ్యవహారం కొనసాగుతూ వస్తోంది.


Click it and Unblock the Notifications