దేశీయ, విదేశీ ప్రయాణాలకు సంబంధించిన విమాన టిక్కెట్లు ఇప్పుడు చాలా చౌక ధరల్లో లభిస్తున్నాయి. కొన్నిసార్లు ఆయా సందర్భాలను పురస్కరించుకుని ఆయా విమానయాన సంస్థలు తక్కువ ధర ఆఫర్లు కూడా ఇస్తుంటాయి. ఈ ఆఫర్లకు కొంత గడువు కూడా ఇస్తాయి. అంటే ఆ గడువులోగా కొన్న వారికే విమాన టిక్కెట్లు చౌక ధరల్లో లభిస్తాయన్నమాట. ఆ తరువాత మళ్లీ వాటి రేట్లు పెరిగిపోతాయి.
అయితే ఇలాంటి సందర్భాలలో విమాన టిక్కెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు ఆయా విమానయాన సంస్థలకు చెందిన వెబ్‌సైట్స్, యాప్స్ ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేయాల్సి వస్తుంది. అయితే అసలు చిక్కంతా ఇక్కడే ఉంటుంది. ఒకే ప్రయాణానికి సంబంధించిన విమాన టిక్కెట్ల కోసం ఇంటర్నెట్‌లో ఆయా విమానయాన సంస్థలకు చెందిన వెబ్‌సైట్లలో వెతుకుతున్నప్పుడు.. ఆయా తేదీలు, ఆయా సమయాలు ఎంటర్ చేసి మనం వెతికే కొద్దీ... టిక్కెట్ల ధరలు వాటంతట అవే పెరిగిపోతూ ఉంటాయి.
అరె, ఇందాక చూస్తే తక్కువగానే ఉంది, అంతలోనే ఈ మార్గంలో టిక్కెట్ ధర పెరిగిపోయిందేమిటి? అని మనం ఆశ్చర్యపోతాం. పోనీలే, రేపు చూద్దాం అని అప్పటికి సరిపెట్టేసుకుని మళ్లీ మర్నాడు.. అదే వెబ్‌సైట్ ఓపెన్ చేసి చూస్తాం. విచిత్రం ఏమిటంటే.. ఆ మార్గంలో విమాన టిక్కెట్ ధర నిన్నటికంటే మరింత పెరిగి ఉంటుంది. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? ఇలాంటి సందర్భాలలో ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే చౌక ధరలకే విమాన టిక్కెట్లు చేజిక్కించుకోవచ్చో ఇప్పుడు చూద్దాం!

ముందస్తు బుకింగే మంచిది...
దేశీయ ప్రయాణాలకైనా.. విదేశీ ప్రయాణాలకైనా సరే, విమాన టిక్కెట్లు ముందస్తుగా బుక్ చేసుకుంటేనే మంచిది. ప్రయాణ తేదీ బాగా సమీపించిన తరువాత టిక్కెట్ల కోసం ప్రయత్నిస్తే జేబుకు చిల్లుపడడం ఖాయం. కాబట్టి కనీసం పదిహేను రోజులు, వీలైతే నెల రోజులు ముందే విమాన టిక్కెట్లు కొనుగోలు చేయడం మంచిది. లేదంటే టిక్కెట్ల కోసం అధిక మొత్తం చెల్లించాల్సి వస్తుంది. అలాగే కొన్నిసార్లు విమానయాన సంస్థలు డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. అలాంటి సమయంలో టిక్కెట్లు కొనుగోలు చేసి పెట్టుకుంటే.. తరువాత ఎప్పుడైనా వాటిని ఉపయోగించుకోవచ్చు. అయితే ఇలా కొనేటప్పుడు ప్రయాణ తేదీలను మార్చుకోవడానికి అవకాశం ఉండేలా చూసుకోవడం శ్రేయస్కరం.

ధరలు పోల్చుకోవడమే శ్రేయస్కరం...
కొన్నిసార్లు ఆయా విమానయాన సంస్థలు పలు మార్గాలలో ప్రయాణాలకు సంబంధించి ఆఫర్లు ఇస్తుంటాయి. ఇలాంటి సందర్భాలలో ఏదో ఒక సంస్థ ఆఫర్‌కు వశమైపోయి గుడ్డిగా టిక్కెట్లు కొనుగోలు చేయకూడదు. ప్రయాణించాలనుకున్న మార్గంలో ఏ విమానయాన సంస్థ ఎంత తక్కువకు టిక్కెట్లు ఆఫర్ చేస్తోందో పోల్చుకుని చూడటం శ్రేయస్కరం. ఎంత అత్యవసరంగా ప్రయాణం చేయాల్సి వచ్చినా.. కనీసం రెండు మూడు సంస్థల వెబ్‌సైట్లలో టిక్కెట్ల ధరలను పోల్చి చూసుకోవాలి. లేదంటే పలు విమానయాన సంస్థలకు సంబంధించిన టిక్కెట్లు విక్రయించే మేక్ మై ట్రిప్, యాత్ర వంటి వెబ్‌సైట్లలో చెక్ చేసుకోవాలి. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా కూడా విమాన టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.

ధరలు ఎప్పుడు, ఎలా ఉంటాయంటే...
సాధారణంగా ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల లోపు ప్రయాణించే విమానాలకు డిమాండ్ అధికంగా ఉంటుంది. దీంతో సహజంగానే ఆ సమయంలో ప్రయాణించే విమానాల టిక్కెట్ల ధరలు కూడా అధికంగానే ఉంటాయి. అలాగే వీకెండ్స్, ఫెస్టివల్స్ సమయాల్లో కూడా టిక్కెట్ల ధరలు అధికంగా ఉంటాయి. ఇక నెలలో చివరి మూడు వారాల్లో విమానయాన సంస్థలు టిక్కెట్ల ధరలను పెంచుతుంటాయి. కాబట్టి సాధారణ రోజుల్లో ధరలు తక్కువగా ఉన్న సమయాల్లో టిక్కెట్లు బుక్ చేసుకోవడం మంచిది. అలాగే అత్యవసరం కానిపక్షంలో ప్రయాణ తేదీలను మార్చుకునేందుకు ప్రయాణికులు సిద్ధంగా ఉండాలి.

వన్ వే ట్రిప్ మంచిదా? రౌండ్ ట్రిప్ మంచిదా?
చాలామంది ప్రయాణికులు విమాన టిక్కెట్లు కొనే సందర్భంలో ‘రౌండ్ ట్రిప్' ఆప్షన్‌ను ఎంచుకుంటారు. అంటే.. రాను, పోను టిక్కెట్లు ఒకేసారి కొనేయడం. కానీ ఈ పద్ధతి అన్ని వేళలా మంచిది కాదు. సాధారణంగా బడ్జెట్ ఎయిర్‌లైన్స్.. అంటే చిన్న స్థాయి విమానయాన సంస్థలు వన్ వే ప్రయాణ టిక్కెట్లనే తక్కువ ధరకు అందిస్తుంటాయి. కాబట్టి టిక్కెట్ల కొనుగోలు సమయంలో కొంత ఓపికతో వ్యవహరించాలి. ఆ మార్గంలో వన్ వే, రౌండ్ ట్రిప్ రెండు ఆప్షన్లనూ పెట్టి టిక్కెట్ల ధరల్లో మార్పులను తనిఖీ చేసుకోవాలి. ఇక ఒకటికంటే ఎక్కువ స్టాపుల్లో ఆగి ప్రయాణించే విమానాల కంటే.. నాన్ స్టాప్ విమానాల (మధ్యలో ఆగకుండా ప్రయాణించేవి) టిక్కెట్ల ధరలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి అంతర్జాతీయ ప్రయాణాలకు ఈ నాన్ స్టాప్ విమానాల్లో టిక్కెట్లు కొనకపోవడమే లాభం.

డిస్కౌంట్ కూపన్లు, రివార్డు పాయింట్లు వాడుకోవాలి...
దాదాపు అన్ని విమానయాన సంస్థలు విమాన టిక్కెట్ల కొనుగోలుకు సంబంధించి డిస్కౌంట్ కూపన్లు, రివార్డు పాయింట్లు ఇస్తుంటాయి. ఇవి మళ్లీ తరువాత ఎప్పుడైనా టిక్కెట్ల కొనుగోలులో ప్రయాణికులకు ఉపయోగపడతాయి. అలాగే తరచూ విమానాల్లో ప్రయాణాలు చేసే వారు ట్రావెల్ క్రెడిట్ కార్డులు తీసుకోవడం మంచిది. ఈ కార్డులను ఉపయోగించడం ద్వారా వచ్చే రివార్డు పాయింట్లు కూడా టిక్కెట్ల బుకింగ్‌లో ఉపయోగపడతాయి. వెబ్‌సైట్ల ద్వారాగాని, యాప్స్ ద్వారాగాని విమాన టిక్కెట్లు కొనుగోలు చేసే సమయంలో చెకవుట్ పేజీకి వచ్చిన తరువాత అక్కడ ఏవైనా అదనపు డిస్కౌంట్ కూపన్లు ఉన్నాయేమో చూసుకోవాలి. ఉంటే వాటిని ఉపయోగించుకోవడం ద్వారా టిక్కెట్ల ధర మరికొంత తగ్గుతుంది.

మన అవసరం వారికి తెలిసిపోతుంది...
డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్, మొబైల్ ఉపయోగించి విమాన టిక్కెట్లు కొనుగోలు చేసే విషయంలో అందరూ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. అదేమిటంటే.. మనం ఉపయోగించే ఇంటర్నెట్ బ్రౌజర్లు (క్రోమ్, ఫైర్‌ఫాక్స్, సఫారీ)లో ఆయా వెబ్‌సైట్లకు సంబంధించిన కుకీస్ స్టోర్ అయి ఉంటాయి. ఇవి ఇంటర్నెట్‌లో మనం ఏం సెర్చ్ చేస్తున్నాం అనేది ఎప్పటికప్పుడు ఆయా వెబ్‌సైట్లకు అందజేస్తూ ఉంటాయి. ఉదాహరణకు.. ఒక మార్గంలో ప్రయాణం కోసం మనం ఆయా విమానయాన సంస్థల వెబ్‌సైట్లలో ప్రయాణ తేదీలు తెలిపి టిక్కెట్ల ధరలను పరిశీలిస్తున్నప్పుడు మన అవసరాన్ని గ్రహించి.. ఆటోమేటిక్‌గా టిక్కెట్ల ధరలు మారిపోయేలా చేస్తారు. అరె.. ఇందాక రూ.500 తక్కువ ఉందే, ఇప్పుడు చూస్తే.. పెరిగిపోయిందే, ఇంకా ఆలస్యం చేస్తే మరో రూ.1000 పెరుగుతుందేమో అని మనం భయపడి వెంటనే సదరు సంస్థ టిక్కెట్లు బుక్ చేసేస్తాం.

‘ఇన్‌కాగ్నిటో మోడ్' ఉపయోగించండి...
ఇలా జరగకుండా ఉండాలంటే ఆయా విమానయాన సంస్థల వెబ్‌సైట్లు, యాప్స్.. మన వెతుకులాటను, అవసరాన్ని గుర్తించకుండా మనమే జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే ఇంటర్నెట్ బ్రౌజర్‌ను ఓపెన్ చేసేటప్పుడే దానిని ‘ఇన్‌కాగ్నిటో' లేదా ‘ప్రైవేట్' మోడ్‌లో పెట్టేయాలి. కీబోర్డుపై షిప్ట్, కంట్రోల్ కీలను నొక్కిపెట్టి ‘ఎన్' అనే కీని నొక్కడం ద్వారా ఈ ‘ఇన్‌కాగ్నిటో' లేదా ‘ప్రైవేట్' మోడ్ బ్రౌజర్‌లోకి ప్రవేశించవచ్చు. ఇది సాధారణ బ్రౌజర్‌కు కొంత భిన్నంగా నలుపు రంగులో కనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల మనం ఇంటర్నెట్‌లో ఏం వెతుకుతున్నాం? దేనికోసం వెతుకుతున్నాం? అన్న సమాచారాన్ని ఆయా విమానయాన సంస్థల వెబ్‌సైట్లకు చెందిన కుకీస్ పసిగట్టలేవు. ఫలితంగా మనం వెతికే కొద్దీ టిక్కెట్ల ధరలు పెరగడం అనేది జరగదు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications