జీవీకే గ్రూప్‌లోని 11 కంపెనీలపై ఎంసీఏ డేగకన్ను!
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలో అతిపెద్ద గ్రూప్ అయిన జీవీకేపై కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ(ఎంసీఏ)కు చెందిన ఆర్థిక వ్యవహారాల విభాగం డేగకన్ను వేసింది. ఈ గ్రూప్‌కు చెందిన కంపెనీల లావాదేవీలను పరిశీలించాలని, తనిఖీలు జరపాలని నిర్ణయించింది.
ఏంసీఏలోని అత్యున్నత స్థాయి వ్యక్తులకు ఇప్పటికే జీవీకే గ్రూప్‌పై విజిల్ బ్లోయర్ లెటర్ అందినట్లు తెలుస్తోంది. దీంతో ఈ గ్రూప్‌లోని ఫ్లాగ్‌షిప్ కంపెనీ జీవీకే పవర్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సహా మొత్తం 11 కంపెనీలు ఎంసీఏ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
జీవీకే గ్రూపులోనూ అవకతవకలు?
జీవీకే గ్రూపులోని పలు కంపెనీలలో అవకతవకలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కంపెనీల నడుమ, బయటికి నిధుల మళ్లింపు జరిగిందని అంటున్నారు. కాంట్రాక్టులు రిలేటెడ్ పార్టీలకే దక్కడం, కాంట్రాక్టుల వ్యయం పెంచేందుకు నకిలీ బిల్లుల సృష్టి, అక్రమ పద్ధతుల్లో ఎక్సైజ్, కస్టమ్స్ డ్యూటీ మినహాయింపులు పొందారనే ఆరోపణలు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది.

మొత్తం 11 కంపెనీలపై ఎంసీఏ నిఘా...
జీవీకే గ్రూప్‌లోని 11 కంపెనీలపై కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కన్ను పడినట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, జీవీకే జైపూర్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రైవేట్ లిమిటెడ్, జీవీకే పవర్, జీవీకే ఇండస్ట్రీస్, నోవాపాన్, గౌతమి పవర్, బెంగళూరు ఇంటర్నేషనల్ లిమిటెడ్ తదితర కంపెనీలు ఉన్నట్లు సమాచారం. నవీ ముంబైలో కొత్తగా ఎయిర్‌పోర్టు నిర్మిస్తోన్న నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్(ఎంఐఏఎల్) పైనా దర్యాప్తునకు ఏంసీఏ ఆదేశించిందని చెబుతున్నారు.
ఆర్వోసీల నుంచి తనిఖీ లేఖలు?
అక్రమ లావాదేవీలు, నిధుల మళ్లింపు ఆరోపణల నేపథ్యంలో జీవీకే గ్రూప్ కంపెనీల ఆడిటర్లు, కంపెనీ సెక్రటరీలపై కూడా ఏంసీఏ నిఘా వేసింది. ఈ గ్రూపు కంపెనీలు దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉండడంతో ఎంసీఏలోని ఆయా ప్రాంతీయ అధికారులు తమ తమ ప్రాంతాల్లోని కంపెనీలకు తనిఖీ లేఖలు పంపినట్లు తెలుస్తోంది. హైదరాబాద్, బెంగళూరు, రాజస్థాన్, ముంబై తదిత ప్రాంతాల్లో జీవీకే గ్రూప్ కంపెనీలు ఉన్నాయి. జీవీకే గ్రూప్ హెడ్ క్వార్టర్స్‌తోపాటు, పలు గ్రూప్ కంపెనీలకూ హైదరాబాద్ కేంద్రం కావడంతో ఎంసీఏ రీజనల్ డైరెక్టర్ కార్యాలయం నుంచి లేఖలు వెళ్లినట్లు సమాచారం.
''లేఖ.. ఆ ఒక్క కంపెనీకే...''
అయితే జీవీకే అధికార ప్రతినిధి మాత్రం ఒక్క ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు(ఎంఐఏఎల్)కు మాత్రమే ఎంసీఏ నుంచి లేఖ అందినట్లు వెల్లడించారు. కొన్ని వివరాలు, సమాచారం తెలియజేయాల్సిందిగా ఎంసీఏ అధికారులు కోరారని, ఇది సాధారణ ప్రక్రియలో భాగమేనని చెప్పారు. ఆ లేఖకు సంబంధించి తాము సమాధానం పంపుతామని తెలిపారు. ఇక విజిల్ బ్లోయర్ కంప్లెయింట్‌పై తమకెలాంటి సమాచారం లేదని, అలాంటి కంప్లెయింట్లపై స్పందించాల్సిన అవసరం కూడా తమకు లేదని సదరు అధికార ప్రతినిధి పేర్కొనడం గమనార్హం.


Click it and Unblock the Notifications