IUC ఛార్జీలు: ట్రాయ్ నిర్ణయంపై రిలయన్స్ జియో ఆగ్రహం
ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ ఛార్జీ (IUC)లపై ట్రాయ్ వైఖరిపై రిలయన్స్ జియో విరుచుకుపడింది. వచ్చే ఏడాది జనవరి నుంచి IUC చార్జీలను రద్దు చేయాలనే నిర్ణయాన్ని ట్రాయ్ సమీక్షించాలని నిర్ణయించడం తిరోగమన చర్యగా అభివర్ణించింది. వినియోగదారుల ప్రయోజనాలు పక్కన పెట్టవద్దని హితవు పలికింది.
వినియోగదారుల ప్రయోజనాలను పక్కనపెట్టి, ప్రస్తుతం రంగంలో ఉన్న రెండు టెలికాం కంపెనీలకు ఐయూసీ రూపంలో భారీగా లబ్ది చేకూర్చేందుకే ట్రాయ్ ఈ నిర్ణయం తీసుకుందని పరోక్షంగా ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఆరోపణలతో ఏకంగా 14 పేజీల లేఖను విడుదల చేసింది. ట్రాయ్ చర్య అత్యాధునిక టెక్నాలజీతో సమర్ధవంతంగా నడుస్తున్న కంపెనీలను శిక్షించేలా, వినియోగదారుల ప్రయోజనాల్ని దెబ్బతీసేలా ఉందని ఎద్దేవా చేసింది.

కాగా, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, ఎయిర్ టెల్ మధ్య IUC రచ్చ రాజుకున్న విషయం తెలిసిందే. ఈ టెలికం ఆపరేటర్లు ఒకరిపై ఒకరు పరోక్ష విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఇతర నెట్‌వర్క్‌లకు మొబైల్ కాల్స్‌పై జియో నిమిషానికి ఆరు పైసలు వసూలు చేయడాన్ని ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా వ్యతిరేకించింది.
జియోలో ఈ నెల 10 నుంచే ఈ ఐయూసీ చార్జీల నిబంధన అమల్లోకి రాగా, అంతకుముందు రీచార్జ్ చేసుకున్న జియో కస్టమర్లకు ఈ చార్జీలేవీ ఉండవు. ఐయూసీ చార్జీలతో సంబంధం లేకుండా ఎస్సెమ్మెస్‌లు మాత్రం ఉచితం. ఈ ఛార్జీలకు వొడాఫోన్ ఐడియా దూరంగా ఉంది.


Click it and Unblock the Notifications